
రేషన్ బండిపై ఎందుకీ కక్ష!
● ఒప్పందం ఉన్నంత వరకూ
ఎండీయూలను కొనసాగించాలి
● అనాలోచిత నిర్ణయాలతో రోడ్డుపాలు చేయొద్దు
● స్థానిక ఎన్నికల్లో కూటమికి గుణపాఠం తప్పదు
● ధ్వజమెత్తిన ఎండీయూ ఆపరేటర్లు
అనకాపల్లి:
కూటమి ప్రభుత్వ పాలనలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, ఇంటింటికీ రేషన్ ఇచ్చే వాహనాలను జూన్ 1వ తేదీ నుంచి నిలిపివేడంతో వేలాది కుటుంబాలు రోడ్డుపడే పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారని రాష్ట్ర సమైక్య ఎండీయూ ఆపరేటర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు జెట్టి శ్రీను అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎండీయూ ఆపరేటర్ల యూనియన్ ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, కూటమి పాలనలో ఉన్న ఉద్యోగాలను తొలగించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, ఈ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి లభించిందని, అయితే ఈ ఏడాది మే 20న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండీయూ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి వారి పొట్ట కొట్టారని అన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2027 జనవరి వరకూ ఇంటింటి రేషన్ కోసం ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలని అన్నారు. ఎండీయూ వ్యవస్థను నమ్ముకుని 18,500 కుటుంబాలు వారి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ, విజయవాడ వరదలు, తిరుపతి వరదల సమయంలో ఎండీయూ అందించిన సేవలు కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు చేయకపోగా, వైఎస్సార్‌సీపీ పాలనలో నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలను కూడా తొలగించడం అన్యాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. 2027 వరకూ ఎండీయూ వ్యవస్థని కొనసాగించాలి లేదా 20 నెలలకు సంబంధించిన మొత్తం బకాయిలు (నెలకు రూ.18 వేలు) చెల్లించాలన్నారు.
ఈ నిరసనలో ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు కోన లక్ష్మణరావు, ఎండీయూ ఉద్యోగులు పాల్గొన్నారు.
పునరాలోచన చేయాలి
విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎండీయూలు అందరం అండగా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు వేతనం రూ.52.45లక్షలు అందజేశాం. ఆ విశ్వాసం లేకుండా ఎండీయూలను విధుల నుంచి తొలగించడం అన్యాయం. రేషన్ డీలర్లు చేసిన మోసాలను దృష్టిలో పెట్టుకుని ఎండీయూ వ్యవస్థను కొనసాగించేలా ప్రభుత్వం ఆలోచించాలి.
– టి.ప్రసాద్, యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు
బడుగువర్గాలకు అన్యాయం
2021లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఇంటింటి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, చంద్రబాబు ఎండీయూలను రద్దు చేయడం అన్యాయం.
–బంగారి లక్ష్మణరావు,
యూనియన్ జిల్లా కార్యదర్శి, అనకాపల్లి
ప్రభుత్వ తీరు దారుణం
రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు మావి. ఎండీయూ వ్యవస్థ ద్వారా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ ఇంటింటికి అందజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా వాహనాలను నిలిపివేయడం అన్యాయం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలకు అధికారం చేపట్టిన తరువాత కూటమి పాలనకు చాలా వ్యత్యాసం కనిపించింది. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే, కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు తొలగించడం అన్యాయం.
–జెట్టి శ్రీను, రాష్ట్ర సమైక్య ఎండీయూ ఆపరేటర్ల
యూనియన్ జిల్లా అధ్యక్షుడు

రేషన్ బండిపై ఎందుకీ కక్ష!

రేషన్ బండిపై ఎందుకీ కక్ష!

రేషన్ బండిపై ఎందుకీ కక్ష!