
చదువులు తిరోగమనం
● అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 స్కూళ్లు రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అక్కడి విద్యార్థులు సమీప హైస్కూళ్లకు తరలింపు ● అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 స్కూళ్ల మూత ● దూరం కానున్న హైస్కూల్ చదువులు ● గ్రామాల్లో డ్రాపౌట్ కానున్న విద్యార్థులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో 46 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ పాఠశాలను రద్దు చేసి విద్యార్థులను 4 కిలోమీటర్ల దూరంలోని వేములపూడి హైస్కూల్‌కు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు అంత దూరం వెళ్లి చదువుకోగలరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనివల్లపేద విద్యార్థులు చదువుకు దూరమై, డ్రాపౌట్‌లుగా మారే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రద్దు చేసిన అనేక పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
విశాఖ విద్య : కూటమి ప్రభుత్వం విద్యారంగంపై ప్రయోగాల పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది రకాల పాఠశాలల పేరుతో పాఠశాల విద్య పునర్నిర్మాణం చేపట్టడం గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యగా ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ కాగా, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలను డీగ్రేడ్ చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయడం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యారంగ నిపుణులు అంటున్నారు. విద్యాశాఖ చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ చూడలేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.
గ్రామీణ విద్యకు విఘాతం
కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించనుంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు. గతంలో దూరం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఐదో తరగతి తర్వాత చదువు మానేసేవారు. అందుకే గత ప్రభుత్వాలు ప్రాథమికోన్నత పాఠశాలలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ప్రస్తుత నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు హైస్కూల్ చదువులు మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని విద్యారంగ నిపుణు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల్లో అసంతృప్తి
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీప హైస్కూళ్లలో విలీనం చేసి, ప్రైమరీ తరగతులకు స్కూల్ అసిస్టెంట్లతో బోధన ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దు చేయడంతో 6, 7, 8 తరగతులను సమీప హైస్కూళ్లకు తరలిస్తున్నారు. ఫలితంగా, ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు (స్కూల్ అసిస్టెంట్లు) వేరే చోటుకు బదిలీ కావలసి వస్తోంది. పాఠశాలల పునర్నిర్మాణం వల్ల ఉపాధ్యాయ పోస్టులకు కోత పడుతోంది. యూపీఎస్‌లు రద్దు చేయడంతో స్కూల్ అసిస్టెంట్లు వేర్వేరు హైస్కూళ్లకు బదిలీ కానున్నారు. ఈ పరిణామాలతో ఉపాధ్యాయులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 ప్రాథమికోన్నత పాఠశాలలను (యూపీఎస్) రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 27, అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 పాఠశాలలు రద్దు కానున్నాయి. ఇకపై ఈ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రద్దు చేసిన యూపీఎస్‌లలోని 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలకు తరలించాలని ఆదేశిస్తూ, దీనికి సంబంధించిన మ్యాపింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఈ విధానం 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో
82 స్కూళ్ల రద్దు

చదువులు తిరోగమనం