
చిన్నారి కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
అనకాపల్లి టౌన్: అనకాపల్లిలో సంచలనం సృష్టించిన బాలిక రోహిత కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇన్‌చార్జి డీఎస్పీ బి.మోహన్‌రావు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న రోహిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కనుగొని, కిడ్నాప్ చేసిన గాజువాకకు చెందిన లక్ష్మి, ఆమె భర్త అప్పలస్వామినాయుడులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేసు దర్యాప్తులో భాగంగా లక్ష్మి ఇచ్చిన సమాచారం మేరకు లోతుగా విచారణ చేపట్టగా.. ఈ కిడ్నాప్‌లో మరో ముగ్గురికి సంబంధం ఉందని నిర్ధారించారు. కశింకోట మండలం ఏఎస్ పేట గ్రామానికి చెందిన గొర్లి శ్రీనివాసరావుకు పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే న్యాయపరంగా అడ్డురావడంతో అక్రమంగా ఎవరినైనా దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతో తనకున్న పరిచయాలతో అనకాపల్లి గాంధీనగర్‌కు చెందిన తగరంపూడి షణ్ముఖను శ్రీనివాసరావు సంప్రదించారు. ఇద్దరూ కలిసి అనకాపల్లి లోకావారి వీధికి చెందిన బోనాల దేవిని సంప్రదించగా.. పాప లేదా బాబు గానీ అప్పజెప్పుతానని, అందుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆమె చెప్పింది. అందుకు ఒప్పుకున్న శ్రీను తన బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి అడ్వాన్స్‌గా షణ్ముఖకు రూ.లక్ష అందజేశాడు. అనంతరం షణ్ముఖ వెళ్లి దేవికి రూ.30వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఆ తరువాత దేవితో ఒప్పందం కుదుర్చుకున్న గాజువాకకు చెందిన లక్ష్మి, అప్పలస్వామినాయుడు.. బాలికను కిడ్నాప్ చేసి, విక్రయించే ప్రయత్నంలో భార్యాభర్తలు పోలీసులకు దొరికిపోయారు. వీరిని ఈ నెల 17న అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా ముగ్గురిని అరెస్ట్ చేసి, షణ్ముఖ నుంచి రూ.70వేలు, శ్రీను నుంచి రూ.750 స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐలు వెంకటేశ్వరావు, ఈశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.