
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
కె.కోటపాడు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోతనవలస గ్రామానికి చెందిన చిరికి మనోజ్(24) బుధవారం కేజీహెచ్‌లో మృతిచెందాడు. మృతుడు తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎ.కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎ.కోడూరు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోతనవలస గ్రామానికి చెందిన మనోజ్ ఈ నెల 17న పోతనవలస నుంచి ఆర్.వై.అగ్రహారానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గ మధ్యంలో రోడ్డుకు అడ్డంగా చెట్టుకొమ్మ పడి ఉండడాన్ని గమనించకుండా వెళ్లడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. మనోజ్ రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కె.కోటపాడులో ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.