సింహాచలం: వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద మంజూరు చేసిన రూ.54.04 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు. వరాహ లక్ష్మీ నృసింహస్వామిని మంగళవారం ఆమె దర్శించుకున్నారు. ఆనంద నిలయంలో ప్రసాద్ పథకంలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనుల ప్రణాళిక, కట్టడాల డిజైన్లను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టూరిజం శాఖ ఇంజినీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రసాద్ స్కీమ్ నిధులు రూ.24.13కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను పూర్తి చేసి ఇటీవలే ప్రారంభించినట్లు చెప్పారు. శ్రీశైలం దేవస్థానంలో రూ.43.08 కోట్ల ప్రసాద్ స్కీమ్ నిధులతో పనులు పూర్తి చేసి రాష్ట్రపతితో ప్రారంభించామన్నారు. రానున్న వారం రోజుల్లో సింహాచలం దేవస్థానానికి సంబంధించి పనులకు టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం, టూరిజం శాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని.. అందుకనుగుణంగా సింహగిరిని అభివృద్ధి చేస్తామన్నారు. భక్తులు వేచి ఉండేందుకు రెండు భారీ డార్మిటరీ హాళ్లను నిర్మిస్తామన్నారు. భారీ క్యూ కాంప్లెక్స్, ఆధునిక పద్ధతిలో షాపింగ్ కాంప్లెక్స్, భక్తులకు త్వరితగతిన అన్నప్రసాదం అందించేందుకు మెకనైజ్డ్ కిచెన్ పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 3,500 మందికి, శని, ఆదివారాల్లో 5 వేల మందికి అన్నప్రసాదం అందిస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం రాజగోపురం ఎదురుగా థియేటర్ నిర్మాణం, నడిచే భక్తుల కోసం 1000 మెట్లను విస్తరిస్తామని చెప్పారు. సింహగిరి ఘాట్‌రోడ్డులో భక్తులకు ఉచిత సౌకర్యం కల్పించేందుకు ఆరు మినీ బ్యాటరీ కార్లు, చార్జింగ్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. గంగధార వద్ద దుస్తులు మార్చుకునేందుకు 10 గదులు నిర్మిస్తామన్నారు. సింహగిరి అందాలు ఆస్వాదించేలా 12 వ్యూ పాయింట్లు సిద్ధం చేస్తామన్నారు. ఏడాదిలోనే పనులు పూర్తి చేసేలా దృఢసంక్పలంతో ముందుకెళ్తామన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాన్నింటిని దర్శించుకునేలా బస్సు సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. యాప్ రూపొందించి అందులో ఆలయాల వివరాలు పొందుపరుస్తామన్నారు. ఆలయాలు, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని వివరించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఈవో త్రినాథరావు, పర్యాటకశాఖ ఈడీ మలిరెడ్డి, చీఫ్ ఇంజినీర్ మూర్తి, ఈఈ రమణ, సింహాచలం దేవస్థానం ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు దినేష్‌రాజ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అప్పన్నను దర్శించుకున్న మంత్రి రోజా
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం మంత్రి ఆర్.కె.రోజా దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని దేవస్థానం ఈవో త్రినాథరావు అందజేశారు.
వారం రోజుల్లో ‘ప్రసాద్’పనులకు టెండర్లు
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా