మొక్కులు తీర్చుకోవడానికి
భారీగా రానున్న భక్తులు
పెదబయలు: మండల కేంద్రం పెదబయలులో మోదకొండమమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున విద్యుత్‌దీపాలను ఏర్పాటు చేశారు. మంగళవారం భారీ ఎత్తున అనుపోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఆదివారం ప్రారంభంకాగా, సోమవారం ఉదయం శతకంపట్టులో కొలువుదీరిన అమ్మవారికి, అమ్మవారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. సోమవారం వారపు సంత కావడంతో అమ్మవారి ఆలయం నుంచి శతకంపట్టు జంక్షన్ వరకు రద్దీ నెలకొంది. పోలీసులు ప్రత్యేక చొరవ చూపి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా మండల పరిషత్,ఆర్‌డబ్ల్యూఎస్,గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీటి సదుపాయం కల్పించారు. ప్రత్యేకంగా ట్యాంక్‌లను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో శ్యాంసుందర్, డిప్యూటీ ఎంపీడీవో పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ ఊరేగింపు
మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి భారీ ఊరేగింపుతో అనుపోత్సవం ఘనంగా ప్రారంభమవుతుంది. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పోలీ సు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జి.మాడుగుల సీఐ ఎస్.లక్ష్మణరావు,స్థానిక ఎస్. వెంకటేష్‌తో పాటు మరో ఐదుగురు ఎస్‌ఐలు పర్యవేక్షించనున్నారు. జనం భారీగా రానున్నారు.
ట్రాపిక్ సమస్య లేకుండా చర్యలు
ఊరేగింపు సందర్భంగా పెదబయలులో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఊరేగింపు ముగిసేంత వరకు రోడ్డుపైకి వాహనాలకు అనుమతి లేదని, అత్యవసర సేవలు అందించే 108, అంబులెన్స్‌లకు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు. పాడేరు నుంచి పెదబయలు వచ్చే వాహనాలు పెదబయలు కస్తూర్బా గాంధీ పాఠశాల సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో నిలపాలని,. ముంచంగిపుట్టు, ఒడిశా ప్రాంతం నుంచి వచ్చే వాహనాలు జెడ్పీ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో నిలపాలని పోలీసులు చెప్పారు.


