తండ్రిని కడతేర్చిన తనయుడు | - | Sakshi
Sakshi News home page

తండ్రిని కడతేర్చిన తనయుడు

May 20 2026 1:40 AM | Updated on May 20 2026 1:40 AM

పెదబయలు: కన్న తండ్రిని ఓ కుమారుడు అతికిరాతకంగా కర్రతో తలపై కొట్టి హతమార్చిన ఘోర ఘటన మండలంలోని సీకరి పంచాయతీ వెల్లపాలెం గ్రామంలో జరిగింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వెల్లపాలెం గ్రామానికి చెందిన లకే సింహాచలం (55) ఈ నెల 18వ తేదీ సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో తన ఇంటి ముంగిట కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అతని కుమారుడు లకే రమేష్‌... నీకు నెలనెలా వస్తున్న వృద్ధాప్య పింఛను డబ్బులు నాకు ఎందుకు ఇవ్వడం లేదు?.. అంటూ తండ్రితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో, రమేష్‌ ఒక్కసారిగా ఆగ్రహంతో పక్కనే ఉన్న కర్రను తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో చెవి, ముక్కుల నుంచి తీవ్ర రక్తస్రావమై సింహాచలం అక్కడికక్కడే మృతి చెందాడు. గత కొంతకాలంగా తండ్రీకొడుకులు ఇద్దరూ మద్యం సేవించి తరచూ గొడవ పడుతుండేవారని, సోమవారం రాత్రి కూడా అలాగే గొడవపడి తండ్రిని కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. మృతుడికి రమేష్‌ ఒక్కడే కుమారుడు.

గతంలో భార్యను కూడా హత్య చేసిన రమేష్‌

నిందితుడు లకే రమేష్‌కు నేరచరిత్ర ఉంది. గతంలో 2018 సంవత్సరంలో గర్భవతిగా ఉన్న తన భార్య సంధ్య (21)ను కొట్టి చంపిన కేసులో ఇతను ఐదేళ్ల పాటు విశాఖపట్నం సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించాడు. గత ఏడాది జైలు నుంచి విడుదలైన రమేష్‌.. ఇంటికి వచ్చినప్పటి నుంచి తాగి వచ్చి తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే తండ్రి పింఛను డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారించారు.

నిందితుడి కోసం గాలింపు..

మృతుడి భార్య నీలమ్మ, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి తరలించి, శవపరీక్ష అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని, రేపటికల్లా పట్టుకుంటామని జి.మాడుగుల సీఐ ఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో వెల్లపాలెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దర్యాప్తులో పెదబయలు, జి.మాడుగుల ఎస్‌ఐలు పి. వెంకటేష్‌, పోలీసు క్లూస్‌ టీమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

వృద్ధాప్య పింఛను కోసం కర్రతో దాడి

మద్యం మత్తులో హతమార్చిన వైనం

నిన్న భార్య.. నేడు తండ్రి..

జైలు నుంచి వచ్చినా మారని బుద్ధి

పరారీలో నిందితుడు

వెల్లపాలెంలో ఘటన

Advertisement
 
Advertisement
Advertisement