సాక్షి, పాడేరు: జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న మారుమూల గిరిజనులకు ముఖ చిత్ర హాజరు (ఎఫ్‌ఆర్‌ఏ) నరకం చూపిస్తోంది. మారుమూల గ్రామాల్లో సెల్ టవర్లు లేకపోవడం, ఉన్న చోట కూడా సిగ్నళ్లు సరిగ్గా అందకపోవడం గిరిజన కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కనీసం 4జీ, 5జీ సేవలు అందుబాటులో లేకపోవడంతో హాజరు నమోదు కాక కూలీలు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్య జిల్లాలో తీవ్ర రూపం దాల్చింది. శనివారం అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీ బొంగిజా గ్రామంలోనూ, పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీలోనూ గిరిజనులు ఎఫ్‌ఆర్‌సీ కోసం సమీపంలోని కొండలెక్కాల్సి వచ్చింది. ఎండను సైతం లెక్కచేయకుండా కొండలపైకి వెళ్లినా, అక్కడ కూడా సెల్ సంకేతాలు అందక హాజరు నమోదు కాలేదు. దీంతో గిరిజన కూలీలు చేసేదేమీ లేక తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. హాజరు పడకపోతే చేసిన పనికి వేతనం రాదన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
నెట్‌వర్క్ లేక ఉపాధి కూలీల అవస్థలు


