ముంచంగిపుట్టు: ముఖ ఆధారిత హాజరుతో ఇబ్బందులు పడుతున్నామని ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గురువారం ఉపాధి హామీ కూలీలు నిరసనకు దిగారు. యాప్ సమస్యతో ప్రతి రోజు గంటల కొద్ది పని ప్రదేశంలో అవస్థలు పడుతున్నామని, కూలీ గిట్టుబాటు కావడం లేదని వేతనదారులు గీదోన్, వసంతరావు, విష్ణు, మూర్తి, రాధ, గుప్తా, ప్రసాద్, సావిత్రి, లైకోన్, పరుశురామ్ ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో గురువారం వైఎస్సార్‌సీపీ నాయకులు ఉపాధి పనులను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో వచ్చిన మార్పులు వేతనదారులకు నష్టం చేస్తున్నాయని, ఫేస్ యాప్ సక్రమంగా పని చేయక పోవడంతో రెండు, మూడు గంటల సమయం వృథా అవుతుందన్నారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కూడా లేకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల సమస్యను అర్థం చేసుకొని యాప్‌ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఉపాధి పనులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.


