అధికారులను కలవడానికి గంటల తరబడి నిరీక్షణ
మండుటెండలో కలెక్టరేట్‌లో పడిగాపులు
పీజీఆర్‌ఎస్‌కు– 109,
రెవెన్యూ క్లినిక్‌కు– 164 అర్జీలు
తుమ్మపాల: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు జిల్లాలో పలు మండలాల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కారం కోసం వృద్ధులు, వికలాంగులతో పాటు సాధారణ ప్రజలు వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్‌కు చేరుకుని తమ సమస్యలను అధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నారు. జిల్లా అఽధికారులను కలవాలంటే గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్జీదారులు వాపోతున్నారు. ఎండల తీవ్రత కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటువంటి నీడ సౌకర్యాలు లేకపోవడంతో చెట్ల కిందే సేదతీరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వేసవిలో సౌకర్యాలు మొరుగుపరచాలని కోరుతున్నారు.
అర్జీలు పునరావృతం అయితే అధికారులదే బాధ్యత...
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సమావేశ మందిరం, వీసీ హాలులో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఎస్‌డీసీ సుబ్బలక్ష్మి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం అయితే సంబంధిత శాఖ జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వివిధ సమస్యలపై పీజీఆర్‌ఎ్‌స్– 109 అర్జీలు, రెవెన్యూ క్లినిక్ కు 164 వినతులు మొత్తం 273 అర్జీలు నమోదైనట్టు తెలిపారు.


