అనకాపల్లి: రాష్ట్రంలో మహిళలు తలదించుకునే విధంగా తన పత్రికలో అనుచిత రాతలు రాసిన ఏబీఎన్ అధినేత రాధాకృష్ణపై సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకాడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికి ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఈ మేరకు స్థానిక ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మోహన్‌రావుకు సోమవారం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకుల ఆధ్వర్యంలో ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బొడ్డేడ మాట్లాడుతూ రాధాకృష్ణ తన పత్రికలో ఇస్టానుషారంగా రాతలు రాస్తున్నప్పటికీ సీఎం చంద్రబాబునాయుడుకు చీమకుట్టినట్లుగా లేదన్నారు. ఇంతవరకూ చర్యలు తీసుకోకుండా మహిళల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. దిగువ స్థాయి స్థాయి పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. ఎస్పీ కార్యాలయంలో న్యాయం జరగని పక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. యలమంచిని నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ విప్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ రాష్ట్రంలో చెల్లెళ్లను కూడా భార్యలు కింద భావిస్తారని చెప్పడం సిగ్గుచేటన్నారు. హిందూ ధర్మంలో మహిళలను ఎంతో గొప్పగా పూజిస్తారని, అటువంటి వారిని కించపరిచే విధంగా తన పత్రికల్లో రాయడం గర్హనీయమన్నారు. మాజీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ మహిళల పట్ల, వైఎస్సార్‌సీపీ నాయకత్వం పట్ల, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెనుక నడిచే వారిపై అవమానపరిచే విధంగా రాతలు చేయడం దారుణమన్నారు. తెలుగుజాతి గౌరవించేలా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీ రామారావు పాలన చేస్తే, నేటి పాలనలో మహిళలను కించపరిచే విధంగా ఏబీఎన్ రాధాకృష్ణతో తమ పత్రికలో రాయించడం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్ సాక్షిగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు చేపడుతుంటే, రాష్ట్రంలో వారిని అవమానించిన రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ మాట్లాడుతూ రాధాకృష్ణకు తన ఇంట్లోనూ మహిళలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. దాన్ని మరచి తన పత్రికల్లో మహిళలను కించపరిచే విధంగా రాయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మహిళలను దైవంగా భావించే దేశంలో వారిని అవమానించడం క్షమించరాని నేరమన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల సమన్వయకర్తలు మలసాల భరత్‌కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేష్, నియోజకవర్గ పరిశీలకులు పైలా శ్రీనివాసరావు, గండి రవికుమార్, వీసం రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పరవాడ జెడ్పీటీసీ పి.సన్యాసిరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.గోవింద్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, సీనియర్ నాయకులు మళ్ల బుల్లిబాబు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


