106.34 గ్రాముల బంగారం, 148.30 గ్రాముల వెండి స్వాధీనం
అనకాపల్లి: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న గాజువాక మండలం వడ్లపూడి కణితి ఆర్.హెచ్.కాలనీకి చెందిన కాండ్రేగుల తోకనాథవీరసాయి శ్రీనివాస్, మేరీలను మండలంలో తుమ్మపాల పంచాయతీ ఏలేరు కాలువ వద్ద పట్టుకున్నామని డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. తమ కార్యాలయంలో సోమవారం ఆమె వివరాలు వెల్లడించారు. శ్రీనివాస్, మేరీల వద్ద నుంచి 106.340 గ్రాముల బంగారం, 148.30 గ్రాముల వెండి, రూ.3,500, రెండు సెల్‌ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులిద్దరూ ఈ నెల 22న పట్టణంలో గాంధీనగరం 1వ వీధిలో తాళం వేసి ఉన్న గృహంలో చోరీకి పాల్పడారని తెలిపారు. అదేరోజు పిసినికాడలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. గతంలో వీరిద్దరిపై విశాఖ, దువ్వాడ పోలీస్ స్టేషన్లో రెండు గంజాయి కేసులు, కోట్లాట కేసులు, చోడవరంలో పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నాయన్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్, క్రైం ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


