చోడవరం: విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మోటారు సైకిలిస్టు దుర్మరణం చెందాడు. తల్లిదండ్రులకు ఏకై క ఆధారమైన కుమారుడు మృతి చెందడంతో వారు బోరున విలపించారు. మండలంలోని బీఎన్‌రోడ్డుపై గజపతినగరం దగ్గర సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందాడు. మాడుగుల మండలం వంటర్లపాలెం గ్రామానికి చెందిన లెక్కల శ్రీనివాసు (28) అచ్యుతాపురం వద్ద లారెన్స్ కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న కంపెనీ తన స్వగ్రామానికి దూరంగా ఉండటంతో అనకాపల్లి మండలం అల్లిఖానుడుపాలెంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ రోజూ డ్యూటీకి వెళుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి డ్యూటీ నుంచి తన స్వగ్రామమైన వంటర్లపాలెం వెళ్లి అక్కడ తల్లిదండ్రులతో గడిపి సోమవారం యధావిధిగా పనికి వెళ్లేందుకు తన మోటారు సైకిల్‌పై అచ్యుతాపురం బయలుదేరాడు. చోడవరం –అనకాపల్లి రోడ్డులో చోడవరం మండలం గజపతినగరం సమీపంలో తన ముందు ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న శ్రీనివాసు మోటారు సైకిల్ అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. దీనితో అతనికి తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. తన కన్నకొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. తమకు దిక్కెవరంటూ వారి ఆవేదన అందర్నీ కలిచివేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జోగారావు తెలిపారు. మృతిదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామన్నారు.


