ఇంధనం గగనం | - | Sakshi
Sakshi News home page

ఇంధనం గగనం

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

జిల్లా వ్యాప్తంగా ఇంధన కొరతతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ బంక్‌ మూతపడుతుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. కొన్ని బంకుల్లో నిల్వలు అంతంతమాత్రంగా ఉండడంతో పెట్రోల్‌, డీజిల్‌ కోసం వాటి వద్ద బారులు తీరుతున్నారు. పెట్రోలు కొరత వల్ల తమ జీవనోపాధికి ఆటంకం కలుగుతోందని ఆటో, జీపు డ్రైవర్లు గగ్గోలుపెడుతున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో అవస్థలు

బంకుల వద్ద ‘నో స్టాక్‌’ బోర్డులు

నరకం చూస్తున్న వాహనచోదకులు

ట్రావెల్‌ సర్వీసులకు ఇబ్బందులు

పాడేరులోని పలు బంకులలో డీజిల్‌ కొరతతో వాహన చోదకులతో పాటు ట్రావెల్‌ సర్వీసు నిర్వాహకులకు ఇబ్బందులు పడుతున్నారు. ఆయిల్‌ లేకపోవడంతో వాహనాలు నిలివేయవలసి వస్తోంది. దీంతో ఉపాధికి ఆటంకం ఏర్పడుతోంది. డీజిల్‌ నిల్వలు లేక పలు బంకులు తరచూ మూతబడుతున్నాయి.అన్ని బంకుల్లో పూర్తిస్థాయిలో ఆయిల్‌ నిల్వలు ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– ఎం.దేముళ్లనాయుడు,

కారు డ్రైవర్‌, పాడేరు

పాడేరులో మూతబడినపాతపెట్రోల్‌ బంక్‌

సాక్షి,పాడేరు: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం జిల్లాపై పడింది.ఇంధన కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో గత కొద్దిరోజుల నుంచి చమురుకు కొరత ఏర్పడినా సోమవారం ఉదయం నుంచి దొరకడం గగనమైంది. పలు బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమివ్వడం కలవరం రేపింది. స్టాకు ఉన్న బంకులకు వాహనదారులు పోటెత్తారు. చమురు నిల్వలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. డిమాండ్‌ నేపథ్యంలో కొన్ని బంకులు కోటా విధానాన్ని అమలు చేస్తున్నారు.

జిల్లా కేంద్రం పాడేరులో పెట్రోల్‌ బంకులను ఒక రోజు తెరిస్తే, రెండు రోజులు మూసివేసే పరిస్థితి ఉండడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పాడేరులోని మూడు ప్రధాన బంకుల్లో సోమవారం ఉదయం నుంచి డీజిల్‌ అమ్మకాలు నిలిపివేశారు. పాడేరులో ప్రధాన బంక్‌ అయిన ఓండ్రు బొజ్జయ్య బంక్‌లో పెట్రోలు,డీజిల్‌ రెండూ లేకపోవడంతో వినియోగదారులు ఆందో ళన చెందారు. జిల్లాలో కొన్నిచోట్ల పెట్రోల్‌ అరకొరగా లభిస్తుండడంతో వాహన చోదకులు ఆయా బంకులకు క్యూకట్టారు.

మన్యంలో ఆయిల్‌ వినియోగం అధికమే

జిల్లా వ్యాప్తంగా హెచ్‌పీ సంస్థకు చెందిన బంకులు 16, బీపీ 3, ఐవోసీ 3 బంకులు ఉన్నాయి.పాడేరులో మాత్రం పలు కంపెనీలకు చెందిన ఆరు బంకులు ఉన్నప్పటికీ ఆయిల్‌ కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రతి బంకులో రోజుకు రెండు వేల లీటర్ల పెట్రోలు, ఐదు వేల లీటర్ల డీజిల్‌ విక్రయిస్తారు.అయితే ఆయిల్‌కు డిమాండ్‌ నెలకొన్నప్పటి నుంచి కంపెనీల నుంచి సరఫరా తగ్గింది.

అభివృద్ధి పనులకు ఆటంకం

డీజిల్‌ కొరతతో మన్యంలోని రోడ్లు,ఇతర అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రస్తుతం పాడేరులో జాతీయ రహదారి పనులతో పాటు ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో మట్టిరోడ్ల పనులు జరుగుతున్నాయి. లారీలు, యంత్రాలకు ప్రతిరోజు పెద్ద మొత్తంలో డీజిల్‌ అవసరం ఉంటుంది. డీజిల్‌ కొరతతో యంత్రాలతో చేస్తున్న పనులన్నీ నిలిచిపోతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కార్లు,జీపులు,ఇతర ట్రావెల్‌ సర్వీసులకు ఇబ్బంది ఏర్పడుతోంది. పూర్తిస్థాయిలో అన్ని బంకులలోను ఆయిల్‌ నిల్వలు ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని పెట్రో,డీజిల్‌ వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement