సీతంపేట (విశాఖ): ప్రముఖ రచయిత్రి, గాయని, అమెరికాలో తెలుగు భాషా సంస్కృతులకు అపారమైన సేవలందిస్తున్న డాక్టర్ శొంఠి శారదాపూర్ణ శనివారం సాయంత్రం అమెరికాలో కన్నుమూశారు. విశాఖపట్నానికి చెందిన ఆమె కళాభారతి శంకర శాస్త్రి మనుమరాలు. శారదాపూర్ణ ఏయూలో తెలుగులో పీహెచ్‌డీ, సంస్కృతంలో ఎం.ఎ, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. అన్నమాచార్య కీర్తనలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన ఆమె.. చికాగో నగరంలో సప్న అనే సంస్థను స్థాపించి అన్నమయ్య కీర్తనలకు విదేశాల్లో బహుళ ప్రాచుర్యం కల్పించారు. అలాగే చికాగో వేద విద్యా పరిషత్తును కూడా స్థాపించారు. భాషారత్న, మహతి పురస్కారం, రాయప్రోలు సుబ్బారావు సాహితీ అవార్డు, తానా పురస్కారం వంటి మరెన్నో గౌరవాలను ఆమె అందుకున్నారు. ఆమె ప్రతీచి, శరద్ధృతి, శరన్నిక్వాణం, శరఝరి, మేఘదూతం, నీతి సాహస్రి వంటి గ్రంథాలను రచించడమే కాక, బ్రాహ్మి అనే పత్రికను కూడా నడిపారు. శారదాపూర్ణ మృతి పట్ల నగరానికి చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ డి.వి.సూర్యారావు, పలువురు సాహితీవేత్తలు తమ గాఢ సంతాపం ప్రకటించారు. ఆమె మరణం సాహితీ, సంగీత లోకానికి తీరని లోటని వారు పేర్కొన్నారు.


