మహనీయులను మరిచారు | - | Sakshi
Sakshi News home page

మహనీయులను మరిచారు

Apr 27 2026 8:06 AM | Updated on Apr 27 2026 8:06 AM

● శతాబ్ది ఉత్సవాల వేళ ఏయూ అధికారుల నిర్వాకం ● రాజా విక్రమ్‌దేవ్‌ వర్మతో పాటు సీఆర్‌ రెడ్డి, సర్వేపల్లి, వీఎస్‌ కృష్ణ, పలువురు ప్రముఖులకు దక్కని గౌరవం ● వారి విగ్రహాలకు కనీసం పూలమాలలు కూడా వేయని వర్సిటీ యంత్రాంగం

విశాఖ సిటీ: విశ్వకళలకు నిలయమై, విశ్వవ్యాప్త ఖ్యాతిని గడించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతజయంతి ఉత్సవాల వేళ చోటుచేసుకున్న పరిణామాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. వర్సిటీ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అధికార యంత్రాంగం ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణి ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులలో తీవ్ర అసంతృప్తిని నింపింది. అసలే ఉత్సవ వేడుకను 26 నుంచి 27కు మార్చడంపై ఉన్న అశాంతికి తోడు, దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని తుంగలో తొక్కడం విమర్శలకు తావిస్తోంది.

గౌరవించుకోరా?

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవిర్భావానికి, అభివృద్ధికి బాటలు వేసిన మహనీయులను గౌరవించుకోవడం ఈ ప్రాంగణంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. వ్యవస్థాపకుడు డాక్టర్‌ సీఆర్‌ రెడ్డి నుంచి మొదలుకొని, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ, రాజా విక్రమ్‌ దేవ్‌ వర్మ వంటి ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా వర్సిటీ గతాన్ని స్మరించుకునేవారు. గతంలో వీసీలు, ఉన్నతాధికారులు అందరూ కలిసి ఈ నివాళుల

ర్పించే కార్యక్రమాన్ని అత్యంత గౌరవప్రదంగా నిర్వహించేవారు. అయితే, ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్‌, రెక్టార్‌, రిజిస్రార్లు ఈ సంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది.

వారి ఖ్యాతి మరిచారా..?

ఏయూ మనుగడకు కారణమైన ఆ మహనీయుల త్యాగాలను, సేవలని ప్రస్తుత పాలకవర్గం విస్మరించింది. వర్సిటీ కోసం వందల ఎకరాల భూమిని దానం చేసిన రాజా విక్రమ్‌ దేవ్‌ వర్మ, ప్రత్యేక వర్సిటీ కోసం పోరాడిన సర్‌ సీఆర్‌ రెడ్డి, విశ్వవిద్యాలయ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రెండో వీసీ డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారి విగ్రహాలు వ్యవస్థాపక దినోత్సవం నాడు వెలవెలబోవడం నగర వాసులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం వర్సిటీ వ్యవస్థాపకులే కాకుండా, ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్‌ పరశురామ్‌ పాత్రో, డాక్టర్‌ సత్యదానందమూర్తి వంటి మహనీయులతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ, బాబు జగజ్జీవన్‌రామ్‌, సర్‌ ఆర్థర్‌ కాటన్‌ వంటి గొప్ప వ్యక్తుల విగ్రహాల వద్ద కూడా కనీస నివాళులు అర్పించకపోవడంపై వర్సిటీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఉన్నతాధికారుల బాధ్యతారహితమైన ప్రవర్తన ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిష్టను, సంస్కృతిని మంటగలుపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement