● అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్
● సీనియర్ నాయకులను
పట్టించుకోవడంలేదంటూ
ఇష్టాగోష్టిలో ఆగ్రహం
తుమ్మపాల (అనకాపల్లి): ‘పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారు. ఒంటెత్తు పోకడలకు పోయి పార్టీని మరింత నిర్వీర్యం చేస్తున్నారు..’ అంటూ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణపై అనకాపల్లి టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి పదవి నుంచి తక్షణమే తొలగించాలంటూ పలువురు సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. మండలంలో తుమ్మపాల వాటర్‌హౌస్ మామిడితోటలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన టీడీపీ సీనియర్ నాయకులు ఇష్టాగోష్టి సమావేశంలో పీలా గోవిందపై తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు బోడి వెంకటరావు మాట్లాడుతూ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీలా గోవింద్ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పీలాను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. మాజీ మండల అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రూపులు సృష్టించి నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారని, పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవాలంటే తక్షణమే పీలాను మార్చాలని డిమాండ్ చేశారు. ఆయన్ను ఇన్‌చార్జిగా కొనసాగిస్తే పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. పార్టీ పేరు చెప్పుకుని వ్యాపారాలు చేసుకోవడమే లక్ష్యంగా పీలా పనిచేస్తున్నారన్నారు. పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకుంటే త్వరలో చలో అమరావతి– సేవ్ టీడీపీ నినాదంతో ఐదు బస్సుల్లో విజయవాడ వెళ్లి చంద్రబాబు, లోకేష్‌లకు ఇక్కడి పరిస్థితి తెలియజేస్తామని చెప్పారు. వేటజంగాలపాలెం మాజీ సర్పంచ్ పూడి చిన్నారావు మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉండి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నాయకులు, కార్యకర్తలను పీలా చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. సీనియర్ నాయకులకు కనీస విలువ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సీనియర్ నాయకులు గూడాల సత్యనారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ పీలా దురాగతాలు, నియోజకవర్గంలో పార్టీ అనిశ్చితిపై అధినేత చంద్రబాబు, లోకేష్ దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ మండల అధ్యక్షుడు గొర్లి శ్రీనివాసరావు, నాయకులు మల్ల శివ నారాయణ, సారిపల్లి శ్రీనివాసరావు, తేలపు గోవిందరావు, కోడి నాగేశ్వరరావు, పట్నాల బుజ్జి పాల్గొన్నారు.


