అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు అమ్మవారి ఆలయ వద్ద వంటకాలు తయారుచేసి, నైవేద్యంగా సమర్పించి, భోజనాలు చేశారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు భక్తులకు ప్రసాదం, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ సదుపాయాలు కల్పించారు. ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ, ట్రాఫిక్ సీఐలు జి.ప్రేమ్‌కుమార్, ఎం.వెంకటనారాయణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


