సింహాచలం (విశాఖ) : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం నుంచి రెండో విడత చందనం అరగదీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వచ్చే నెల 1న వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సమర్పించే మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) చందనాన్ని సిద్ధం చేసేందుకు ఈ ప్రక్రియను చేపట్టారు. ఉదయం అర్చకులు చందనం చెక్కలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం, సిబ్బంది అరగదీతను ప్రారంభించారు. మొదటి రోజు 48 కిలోల చందనాన్ని అరగదీశారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
రేపటి నుంచి చందనం విక్రయాలు
మంగళవారం నుంచి సింహగిరిపై భక్తులకు చందనం విక్రయించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈఓ జె. వెంకటరావు తెలిపారు. ఆలయ ప్రసాదాల విక్రయశాలలో ఉదయం 8 గంటల నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. చందనం కొనుగోలు చేయాలనుకునే భక్తులు తమ అధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఒక్కొక్కరికి ఒక ప్యాకెట్ చొప్పున రూ.10కి విక్రయించడం జరుగుతుందన్నారు.


