మద్దిలపాలెం (విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భవిష్యత్ తరాలకు నేటి చరిత్రను అందించే లక్ష్యంతో.. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ‘కాల స్మృతి గుళిక’ను ఏర్పాటు చేశారు. వందేళ్ల వేడుకల సందర్భంగా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనేక చారిత్రక అంశాలను దీనిలో భద్రపరిచామని, వీటిని 50 ఏళ్ల తర్వాత తెరిచి చూసేలా ప్రణాళిక రూపొందించామని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, ఏయూ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు కె.వి.వి.రావు తెలిపారు. ఈ కాల స్మృతి గుళికను శతాబ్ది ఉద్యానవనంలో ప్రత్యేకంగా భద్రపరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం పరిపాలన భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన చారిత్రక చాయాచిత్రాల ప్రాంగణాన్ని వారు సందర్శించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టర్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్లు, తదితరులు పాల్గొన్నారు.


