భారీగా తరలివచ్చిన భక్తజనం
సీలేరు: డప్పు వాయిద్యాలు, బాణసంచాలు, పసుపు కుంకుమలు, ధూపదీప నైవేద్యాల మధ్య స్థానిక గ్రామ దేవత మారెమ్మ తల్లి ప్రధాన పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా ముగిసింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో 1950 ప్రాంతంలో జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణ సమయంలో తమిళనాడు నుంచి వచ్చిన కూలీలు కొండల మధ్య గుంటవాడ రిజర్వాయర్‌కు ఎదురుగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నేటి వరకు ఏటా విద్యుత్ కాంతుల వెలుగుల మధ్య అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
భక్తులతో కిక్కిరిసిన సీలేరు
ఈ నెల 14న ప్రారంభమైన జాతర ఆదివారంతో ముగిసింది. తెల్లవారుజాము ఆరు గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో సీలేరు గ్రామం కిక్కిరిసిపోయింది. ఆలయ అర్చకులు దామోదర శర్మ, డొంకాయి శ్రీను నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. మాలధారణ చేసిన భవానీ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
● విశాఖపట్నానికి చెందిన పోలీస్ అధికారి కె. నాగరాజు–విజయ దంపతులు సుమారు 3వేల మందికి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. పండుగకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం మూడు చోట్ల మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
కానుకల సమర్పణ
తమిళనాడుకు చెందిన వర్ష అనే భక్తురాలు అమ్మవారికి అడుగున్నర ఎత్తు గల దీపపు కుందిని బహూకరించగా, వానపల్లి జయమ్మ అనే భక్తురాలు వెండి సామ గ్రిని అందజేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆల య కమిటీ సభ్యులు అమ్మవారి ఫొటోలను పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎస్‌ఐ యాసీన్ ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.


