చింతపల్లి: ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ కాఫీ తోటల్లో పనిచేస్తున్న గిరిజన కూలీలకు ఆన్‌లైన్ ద్వారా వేతనాలు చెల్లించడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి నేరుగా (నగదు రూపంలో) వేతనాలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గెమ్మిలి మోహనరావు డిమాండ్ చేశారు. చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల పరిధిలోని కాఫీ తోటల్లో పనిచేస్తున్న కూలీలకు వేతనాలు ఆన్‌లైన్‌లో జమ కావడంతో సమయానికి చేతికందక ఇబ్బంది పడుతున్నారు.మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ కూలీలకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలపై కనీస అవగాహన లేకపోవడంతో, తమ కష్టార్జితాన్ని పొందేందుకు నానా అవస్థలు పడుతున్నారు.అటవీ గ్రామాల్లో నివసించే వీరికి బ్యాంకులు అందుబాటులో లేవు. కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏటీఎంలు లేదా బ్యాంకు మిత్రల వద్దకు వెళ్తే, అక్కడ తరచూ సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ తోటల్లో పనిచేసే మహిళలు, యువత, నిరుద్యోగులు రోజువారీ కూలీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వేతనాలు సకాలంలో అందకపోవడం వల్ల కుటుంబ అవసరాలు తీరక వారు ఆర్థికంగా కుంగిపోతున్నారని మోహనరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల వల్ల కూలీలు కాఫీ తోటల పనులకు దూరమయ్యే ప్రమాదం ఉందని హె చ్చరించారు. ఏపీఎఫ్‌డీసీ అధికారు లు స్పందించి నేరుగా వేతనాలు చెల్లించే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘ
ప్రతినిధి మోహనరావు డిమాండ్


