ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి

Apr 27 2026 7:36 AM | Updated on Apr 27 2026 7:36 AM

అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి

ముంచంగిపుట్టు: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని సత్యం, ధర్మ మార్గాల్లో నడవాలని అరకు పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ గుమ్మా తనూజరాణి అన్నారు. మండలంలోని సుజనకోట గ్రామ పంచాయతీ కేంద్రంలో శ్రీశ్రీ గంగమ్మ తల్లి ఆలయ పునఃప్రారంభోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు హోమం జరిపించి, ఆలయంపై బంగారు గోపురాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ దంపతులు డాక్టర్‌ గుమ్మా తనూజరాణి, వినయ్‌, అరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు చెట్టి పాల్గుణ, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్‌ వంపూరి గంగులయ్య, స్థానిక ఎంపీటీసీ దంపతులు సుబ్బలక్ష్మి, దామోదరం, వైస్‌ ఎంపీపీ భాగ్యవతి తదితరులు గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎంపీ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

అభివృద్ధికి ఎంపీ హామీ

ఆలయం చుట్టూ ఎంపీ నిధులతో ప్రహరీ గోడ నిర్మించాలని కమిటీ సభ్యులు కోరగా, ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం, ప్రార్థనకు కేటాయించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందని ఎంపీ పేర్కొన్నారు. సుజనకోట గంగమ్మ తల్లి ఆలయం ఎంతో సుందరంగా ఉందని, ఎంపీ నిధులతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కిముడు రామారావు, ప్రధాన కార్యదర్శి సమరెడ్డి కృష్ణబాలుడు, కోశాధికారి మండి పద్మరాజు ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. సుమారు రెండు వేల మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, మాజీ సర్పంచులు, సరిహద్దు గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement