చింతపల్లి: ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరత నేపథ్యంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగానే పంపిణీ చేయాలని చింతపల్లి బ్రాంచ్ మేనేజర్ ఎస్. సుగుణాఽథం సూచించారు. ఆదివారం ఆయన స్థానిక పెట్రోల్ బంకును సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు మరియు వినియోగదారులకు అందుతున్న సరఫరా పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక బంకు ద్వారా ప్రతిరోజూ 3.5 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు ఇంధన విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం విశాఖ హెచ్‌పీసీఎల్ నుంచి ఆయిల్ ట్యాంకర్లు క్రమబద్ధంగా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. గతంలో నగదు లేదా చెక్కు చెల్లించిన వెంటనే ట్యాంకర్లు వచ్చేవని, ఇంధన కొరత కారణంగా ఇప్పుడు సరఫరాలో జాప్యం జరుగుతోందని వివరించారు.
అందరికీ అందాలనే ఈ నిర్ణయం..
అందుబాటులో ఉన్న ఇంధనాన్ని వాహనదారులందరికీ ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే పరిమిత సరఫరా నిబంధన విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద వాహనాలకు సైతం మితంగానే ఇంధనం నింపాలని సిబ్బందిని ఆదేశించారు. గతంలో బయట వ్యక్తులకు కెన్ల ద్వారా అధిక మొత్తంలో డీజిల్, పెట్రోల్ పంపిణీ చేసేవారని, ఇకపై వారికి కూడా పరిమితంగానే ఇవ్వాలని స్పష్టం చేశారు. వినియోగదారుల పట్ల సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.
జీసీసీ చింతపల్లి బ్రాంచ్ మేనేజర్
సుగుణాథం


