సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి రెండో విడత చందనం అరగదీత ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 1వ తేదీన వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని, ఆ రోజు స్వామికి సమర్పించేందుకు మూడు మణుగుల పచ్చి చందనాన్ని(సుమారు 125 కిలోలు) సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం చందనం చెక్కలను అరగదీతకు వీలుగా ముక్కలుగా కోశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఇన్‌చార్జి డీఈ హరి, సిబ్బంది సాంబ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఏడాదిలో స్వామి వారికి చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఉదయం వేళల్లో మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తామని అర్చకులు తెలిపారు. ఇప్పటికే చందనోత్సవం సందర్భంగా తొలి విడత చందన సమర్పణ పూర్తయిందని, రెండో విడతగా వచ్చే నెల 1న స్వామికి చందనం అలంకరిస్తామని వారు వివరించారు.


