గిట్టుబాటు.! | - | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు.!

Apr 26 2026 2:57 AM | Updated on Apr 26 2026 2:57 AM

ఏజెన్సీ ప్రాంతాల్లో పండించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కక గిరిజన రైతులు దళారుల చేతిలో నష్టపోతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దళారులు భారీ లాభాలు పొందుతుంటే.. రైతులు మాత్రం పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో అప్పులపాలవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంతో పాటు పాడేరు ఐటీడీఏ కూడా కనీస మద్దతు ధరల కల్పనపై దృష్టి సారించడం లేదు. గిరిజనులకు అండగా నిలవాల్సిన జీసీసీ కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది.
దళారులకే

సాక్షి, పాడేరు: గిరిజనులు సాగు చేసే వ్యవసాయ, వాణిజ్య పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. రిటైల్‌గా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అధిక ధరలు పలికే గిరిజన ఉత్పత్తులకు సంతల్లో రైతుల నుంచి కొనుగోలు చేసే సమయంలో మాత్రం వ్యాపారులు కనీస గిట్టుబాటు ధరలు అమలు చేయడం లేదు. గ్రామాలతో పాటు అన్ని వారపు సంతల్లోను స్థానిక, మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులదే రాజ్యం. ఇప్పటికే కాఫీ గింజల అమ్మకాలతో నష్టపోయిన గిరిజన రైతులకు.. పసుపు, పిప్పలమోడి, మిరియాల పంటల అమ్మకాల్లోను అన్యాయమే జరుగుతుంది.

ధరలు తగ్గించి.. నిలువునా మోసం

కాఫీ గింజల సీజన్‌ చివరిలో జీసీసీ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్‌ వ్యాపారులంతా సిండికేట్‌ అయి కిలో రూ.400 నుంచి రూ.450 చొప్పున తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇలా కిలోకు రూ.50 నుంచి రూ.100 వరకు రైతులు నష్టపోయారు. సీజన్‌ చివరిలో సుమారు 2 వేల టన్నుల వరకు నిల్వల ఉండిపోవడంతో గిరిజన రైతులకు నష్టాలు తప్పలేదు.

అంతర పంటలకూ దక్కని మద్దతు

అంతర పంటగా సాగు చేస్తున్న పసుపు, పిప్పలమోడి పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో పసుపు, పిప్పలమోడి పంటలు సాగవుతున్నాయి. ఈ రెండు పంటల ద్వారా అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అయితే గతేడాది కన్నా పసుపు, పిప్పలమోడి ధరలు ప్రస్తుతం తగ్గించేశారు. కిలో పసుపును రూ.130, పిప్పలమోడిని రూ.230 చొప్పున కొనుగోలు చేస్తుండడంతో రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. మిరియాలకు కూడా ఐటీడీఏ గిట్టుబాటు ధర కల్పించలేక పోయింది. మిరియాలకు జాతీయ స్థాయిలో కిలో రూ.1000 పైగా ధర పలుకుతున్నా.. వ్యాపారులు మాత్రం కిలో రూ.650 చొప్పున కొనుగోలు చేసి గిరిజన రైతులను మోసం చేస్తున్నారు. ఏజెన్సీలో లక్ష ఎకరాల కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలు సాగవుతున్నాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, గుత్తులపుట్టు, జి.మాడుగుల, కించుమండ, అన్నవరం, అరకు, సుంకరమెట్ట వంటి పెద్ద సంతల్లో వ్యాపారం భారీగా జరుగుతున్నా వ్యాపారులకు మాత్రమే కలిసొస్తోంది. కష్టపడి సాగు చేసిన గిరిజన రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు రావడం లేదు. శనివారం హుకుంపేట సంతలో భారీగా వ్యాపారాలు జరిగినప్పటికి వ్యాపారులంతా సిండికేట్‌గానే తయారై ధరలు తగ్గించి కొనుగోలు చేశారు.

గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధరల కరువు

కనీస ధరల కల్పనలో ఐటీడీఏ విఫలం

జీసీసీ కూడా పట్టించుకోని వైనం

ఇప్పటికే కాఫీ అమ్మకాల్లో

రైతులకు భారీ నష్టం

మిరియాలు, పసుపు, పిప్పలమోడి ధరలూ పతనం

కాఫీ, మిరియాలకు మద్దతు కరువు

ఈ ఏడాది కాఫీ, మిరియాల పంటలకు సంతల్లో గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. పంట దిగుబడులు తగ్గడంతో ధరలు పెరుగుతాయని ఆశపడ్డాం. జీసీసీ చివరిలో కాఫీ గింజలు కొనుగోలు చేయకపోవడంతో కిలో రూ.430 చొప్పున తక్కువ ధరకు అమ్ముకున్నాను. మిరియాల గింజలకు బయట మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్నా కూడా కిలో రూ.600 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు.

– పాంగి కోటేశ్వరరావు, కాఫీ రైతు,

వల్లాపురం, పాడేరు మండలం

ప్రభుత్వానికి పట్టని రైతుల నష్టాలు

ఏజెన్సీలో గిరిజన రైతులు సాగు చేస్తున్న వ్యవసాయ, వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరల కల్పనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. సంతల్లో వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి మార్కెట్లలో ధరలకు అనుగుణంగా ఏజెన్సీలో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఐటీడీఏలపై ఉంది. జీసీసీ కూడా అన్ని పంటలను కొనుగోలు చేయాలి.

– పాలికి లక్కు, రైతు సంఘం నేత,

గుర్రగరువు, పాడేరు మండలం

పసుపు, పిప్పలమోడి ధరలు పతనం

రెండేళ్ల క్రితం పసుపు, పిప్పలమోడికి గిట్టుబాటు ధరలు ఉండేవి. కిలో పసుపును రూ.160 చొప్పున అమ్మిన నేను ఈ ఏడాది కిలో రూ.130కు అమ్ముకుని నష్టపోయాను. పిప్పలమోడికి ధరలు పతనం చేశారు. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. – సుర్ర చిట్టిబాబు, పసుపు

రైతు, కరకపుట్టు, పాడేరు మండలం

Advertisement
 
Advertisement
Advertisement