మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ, ఆ సరస్వతీక్షేత్రం అందించిన అత్యున్నత పురస్కారాల చరిత్రను నెమరువేసుకోవడం ఎంతో గర్వకారణం. సాధారణంగా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇవ్వడం పరిపాటే అయినా, ఏయూ ప్రదానం చేసే కళాప్రపూర్ణ పురస్కారానికి దేశంలో మరే వర్సిటీకి లేని ప్రత్యేకత ఉంది. కళలు, సాహిత్యం, చలనచిత్ర రంగాలను ప్రోత్సహించే దిశగా నాటి ఉపకులపతి సర్ సి.ఆర్.రెడ్డి ఈ అరుదైన పురస్కారానికి శ్రీకారం చుట్టారు. 1927 డిసెంబర్ 5న జరిగిన తొలి స్నాతకోత్సవంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి గౌరవ డాక్టరేట్ అందుకోగా, విశ్రాంత సంస్కృత ఆచార్యులు వేదం వెంకటరాయ శాస్త్రి తొలి కళాప్రపూర్ణను స్వీకరించారు. ఆ మరుసటి ఏడాదే నోబెల్ గ్రహీత సి.వి.రామన్‌కు గౌరవ డాక్టరేట్ అందించడం ఏయూ ఘనతను చాటుతుంది. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది ఉద్దండులకు ఈ పురస్కారం వరించింది. గిడుగు రామమూర్తి, గుర్రం జాషువా, కాశీనాథుని నాగేశ్వరరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి.నారాయణరెడ్డి, బోయి భీమన్న వంటి సాహిత్య దిగ్గజాలను ఏయూ సత్కరించింది. అలాగే ఎన్టీఆర్, ఏఎన్నార్, భానుమతి, కృష్ణ, చిరంజీవి లాంటి సినీ శిఖరాలు, మంగళంపల్లి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి సంగీత సామ్రాట్లు, బాపు, దాసరి నారాయణరావు వంటి దర్శకులు కళాప్రపూర్ణ అందుకున్న వారిలో ఉన్నారు. 1978లో జరిగిన 50వ స్నాతకోత్సవంలో ఒకే సారి 15 మంది ప్రముఖులకు ఈ పురస్కారాలు అందించడం విశేషం. సాహిత్య, కళా రంగాలకే పరిమితం కాకుండా క్రీడా రంగాన్ని సైతం ప్రోత్సహిస్తూ 1988లో సునీల్ గవాస్కర్‌కు, 1990లో సి.ఎస్.నాయుడుకు ఏయూ క్రీడా ప్రపూర్ణ అందజేసింది. ఇక ఏయూ స్నాతకోత్సవాలకు విచ్చేసిన ముఖ్య అతిథుల జాబితా కూడా అంతే ఘనమైనది. సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి.రామన్, సరోజిని నాయుడు, ఇందిరాగాంధీ, దలైలామా, ఎ.పి.జె అబ్దుల్ కలాం, నీలం సంజీవరెడ్డి లాంటి దేశ, విదేశీ ప్రముఖులు వర్సిటీ వేదికను అలంకరించారు. 1993లో మదర్ థెరిసాకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం ఏయూను సందర్శించి ప్రత్యేక ప్రసంగం చేశారు. నూరేళ్ల పండుగ చేసుకుంటున్న ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఇలా ఎందరో మహానుభావులను సత్కరించి తన కీర్తి కిరీటంలో అరుదైన మణిమాణిక్యాలను పొందుపరుచుకుందని చెప్పవచ్చు.
మహానుభావులను వరించిన పురస్కారం


