కొయ్యూరు: వేసవిలో పశువుల దాహం తీర్చేందుకు ఏర్పాటు చేసిన పశువుల నీటి తొట్టెలు నీరు లేక నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు పశువుల తొట్టెలను గతేడాది నిర్మాణం చేపట్టారు. అంత వరకు బాగానే ఉంది. కానీ వాటిలో నీరు మాత్రం వేయించడం లేదు. ఫలితంగా ఆశయం నీరుగారిపోతోంది. భానుడు ప్రతాపంతో ఎండలు గట్టిగానే కాస్తున్నాయి. మేతకు వెళ్లిన పశువులు తాగునీటి కోసం అల్లాడిపోతున్నాయి. కాలువలు ఉన్న చోట్ల కొంత వరకు పర్వాలేదు. అవి లేని చోట్ల దాహంతో ఉండాల్సి వస్తుంది. పంచాయతీకి ఒక నీటి తొట్టెను కిందటి సంవత్సరం నిర్మాణం చేశారు. ఇందుకు ఒక్కో తొట్టె కోసం రూ.32 వేల వరకు ఖర్చు చేశారు. మొత్తం 27 తొట్టెలను నిర్మించారు. వేసవిలో రెండు నెలల పాటు రోజూ తొట్టెల్లో నీటిని పోయాలి. నీరు అందుబాటుగా ఉన్న ప్రాంతాల్లోనే వీటి నిర్మాణం చేపట్టారు. వీటికి నీటి సరఫరా చేసే బాధ్యతను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించారు. దీనిపై పర్యవేక్షణ లోపించడంతో తొట్టెల్లోకి నీరు సరఫరా కావడం లేదు. నీరు ఉంటే పశువులతో పాటు పక్షులు, కోతులు లాంటివి దాహం తీర్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఊట కాలువలు కూడా ఎండలకు ఎండిపోయే స్థితికి చేరాయి. దీంతో నీటి కొరత ఎక్కువైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తొట్టెల్లో తాగునీరు సరఫరా చేయాలి. దీనిపై ఉపాధి హామీ ఏపీడీ సీతయ్యను సంప్రదించగా.. తొట్టెల్లోకి నీటిని సరఫరా చేసే బాధ్యతను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తీసుకోవాలని చెప్పారు.
దాహం తీర్చని పశువుల నీటి తొట్టెలు
గతేడాది తొట్టెలు నిర్మించి
వదిలేసిన వైనం
ఎండలకు దాహంతో
అల్లాడుతున్న పశువులు


