● ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ
● డుంబ్రిగుడ మండలంలో
ఆకస్మిక పర్యటన
డుంబ్రిగుడ: పర్యాటక కేంద్రం చాపరాయిలో పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పని చేద్దామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ అన్నారు. డుంబ్రిగుడ మండలంలో శనివారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూపరమైన సేవలపై ఆరా తీశారు. సమీపంలో వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిరు ధాన్యాల కేంద్రం(మిల్లెట్స్‌హబ్)ను సందర్శించారు. వ్యాపార లావాదేవీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చాపరాయి పరిసర ప్రాంతాలను సందర్శించి పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. రోజు వారీగా వచ్చే ఆదాయంతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం అదనంగా రెండేసీ చొప్పున మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను పీవో ఆదేశించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 2021–22 మధ్య కాలంలో తలపెట్టి అసంపూర్తిగా మిగిలిన శివాలయాన్ని పూర్తి చేయాలని స్థానికులు పీవోకు విన్నవించుకున్నారు. ఈ మేరకు పీవో ఆ దేవాలయాన్ని పరిశీలించి పూర్తి చేయించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీ డీఏ పీటీజీ విభాగం ఏపీవో వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీఈ అభిషేక్, తహసీల్దార్ త్రివేణి, చాపరాయి సిబ్బంది పాల్గొన్నారు.


