సాక్షి, పాడేరు: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన పాలిసెట్–2026 పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాడేరులో ఆరు, చింతపల్లిలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, తలారిసింగి గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల, కుమ్మరిపుట్టు ఏపీఆర్ పాఠశాల, ఏపీఆర్ కళాశాల, శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల, చింతపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 1692 మంది విద్యార్థులు హాల్ టికెట్లు పొందగా.. 1343మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 349 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పాడేరులోని పలు పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తనిఖీ చేశారు. పాలిసెట్ జిల్లా పరిశీలకుడు డాక్టర్ బి.ఆర్.ఎస్.గంగస్వామి, జిల్లా సమన్వయకర్త, పాడేరు పాలిటెక్నిక్ నోడల్ ప్రిన్సిపాల్ హరిబాబు, పాడేరు పట్టణ పరిశీలకుడు కె.రాజు ఆయా పరీక్ష కేంద్రాలను సందర్శించి, పర్యవేక్షించారు.


