నర్సీపట్నం: న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని శాంతియుత నిరసన తలపెడితే సీఐటీయు, పయనీర్ కంపెనీ కార్మికులను అరెస్ట్ చేయడం అన్యాయమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. అరెస్ట్‌ను నిరసిస్తూ శుక్రవారం పట్టణంలో సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. కార్మికుల పక్షాన పోరాడుతున్న సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల శంకరరావు, అడిగర్లరాజుతో పాటు ముగ్గురు కార్మికులను అరెస్టు చేయడం పోలీసులకు తగదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా యాజమాన్యం పోలీసులను ఉపయోగించి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి, బలవంతంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కార్మికులకు అండగా నిలిచిన సీఐటీయు నాయకత్వాన్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే జిల్లా లేబర్ కమిషనర్ జోక్యం చేసుకుని కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈ.చిరంజీవి, ఎస్.వి.నాయుడు, ఎస్.నాగ రమణ, ముఠాకార్మిక సంఘం నాయకులు రాము పాల్గొన్నారు.
మాడుగుల రూరల్: జిల్లాలో మాకవరపాలెంలో పయనీర్ (రస్‌ఆల్ కై మా , ఆన్‌రాక్ అల్యూమినియం కంపెనీ)లో పనిచేస్తున్న కార్మికులు నాలుగు రోజులుగా వేతనాలు పెంచాలని కోరుతూ అందోళన చేస్తుండగా, వారికి మద్దతు పలికిన కార్మిక నేతలను అరెస్టు చేయడం అన్యాయమని ప్రజా సంఘాలు నాయకులు మండిపడ్డారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా కార్యదర్సి ఇరటా నర్సింహమూర్తి, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర కలిసి స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు ఇవ్వడానికి వెళ్లిన సీఐటీయూ జిల్లా కార్యదర్సి ఆర్. శంకరావు, సీఐటీయు రాష్ట కమిటీ సభ్యులు జి. కోటీశ్వరరావు, ఎ.రాజాను అరెస్టు చేయడం అన్యాయమన్నారు.ఆన్‌రాక్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు పలు పర్యాయాలు అందోళన చేసినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అరెస్టు చేసిన నాయకులను జిల్లాలో అనేక పోలీసుస్టేషన్‌లకు తిప్పి, చివరకు గొలుగొండ పోలీసుస్టేషన్‌లో ఉంచడం కంపెనీ యాజమాన్యానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారనడానికి నిదర్శనమన్నారు.


