ప్రజల భాగస్వామ్యంతో మలేరియా నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతో మలేరియా నియంత్రణ

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

తుమ్మపాల: ప్రభుత్వం మలేరియా నియంత్రణ కోసం ఇంటింటి పర్యటనలు, రక్త నమూనాల సేకరణ, సత్వర చికిత్స, దోమల లార్వా నియంత్రణ చర్యలపై చేస్తున్న అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజల భాగస్వామ్యంతో మలేరియా నియంత్రణ సాధ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్‌ ఎం.హైమవతి, డీఎంహెచ్‌ఓ కె.వరహాలదొర అన్నారు. తుమ్మపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రపంచ మలేరియా దినోత్సవంలో 2026 సంవత్సరానికి మలేరియా నిర్మూలన దిశగా ‘ఇప్పుడు మనం సాధించగలం, ఇప్పుడు మనం తప్పక సాధించాలి...’ అనే థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలేరియా అనేది దోమల ద్వారా వ్యాపించే ఒక ప్రాణాంతక వ్యాధి అని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా నివారించవచ్చన్నారు. జ్వరం, వణుకు, తలనొప్పి, అలసట, వాంతులు, చెమటలు పట్టడం వంటివి మలేరియా లక్షణాలని, వాటి నివారణకు ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ కాకుండా చూడాలన్నారు. దోమల పెరుగుదలను నివారించడానికి ప్రతి వారం డ్రైడే పాటించాలని, దోమ తెరలు ఉపయోగించాలని, అవసరమైన చోట్ల కీటకనాశక మందులు పిచికారీ చేయాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకొని, వైద్యుల సూచన మేరకు పూర్తి చికిత్స తీసుకోవాలని అన్నారు. మలేరియా నిర్మూలనపై వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement