ప్రాణం తీసిన నిద్రమత్తు | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన నిద్రమత్తు

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

ఆగివున్న లారీని ఢీకొన్న వ్యాన్‌

కుమార్తె మృతి

డ్రైవర్‌, భార్య, మరో కుమార్తెకు గాయాలు

అనకాపల్లి: తండ్రి నిద్రమత్తు కుమార్తె ప్రాణాలు బలిగొంది... అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఎంతో సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన ఆ బాలిక అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అనకాపల్లి జాతీయరహదారిలో నాగుపలాపల్లి జంక్షన్‌ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా, ఆ బాలిక తల్లి,తండ్రి, సోదరి గాయపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ జి.సత్యనారాయణ తెలిపిన మేరకు వివరాలు...

రావులపాలెంలో రుద్రసాయి ప్రసాద్‌(డ్రైవర్‌) వ్యాన్‌లో అరటిపళ్లు లోడు చేసుకుని బొబ్బిలి వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం బయలుదేరాడు. పనిలోపనిగా రాజంలోగల తన అత్తవారింటి వద్ద దింపేందుకు తన స్వగ్రామం కాకినాడ జిల్లా అనపర్తిలో తన భార్య రుద్రగీత, పెద్ద కుమార్తె నాగ తనూజ(09), చిన్న కుమార్తె నాగ చైతన్య అజ్యశ్రీలను వ్యాన్‌లో ఎక్కించుకున్నాడు. శనివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో వ్యాన్‌ డ్రైవర్‌ ప్రసాద్‌కు ముఖం కడుగుకోవాలని కశింకోట పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెచ్‌సీ నీరు అందజేశారు. అనంతరం తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద వ్యాన్‌ కొంతసేపు ఆపారు. అక్కడి నుంచి బయలుదేరి కొంతదూరం ప్రయాణించిన తరువాత డ్రైవర్‌ ప్రసాద్‌కు నిద్ర వస్తుండడంతో కశింకోట వద్ద వ్యాన్‌ను ఆపి, టీ తాగి బయలుదేరారు. అనకాపల్లి జాతీయ రహదారి నాగులాపల్లి జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌ ప్రసాద్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఆ మత్తులో అక్కడ అగి ఉన్న లారీ వెనుక భాగాన ఢీ కొట్టడంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న పెద్దకుమార్తె నాగతనూజ(9) అక్కడికక్కడే మృతిచెందినట్టు ఎస్‌ఐ చెప్పారు. డ్రైవర్‌ ప్రసాద్‌, భార్య గీత, చిన్నకుమార్తె నాగచైతన్య అజశ్రీలు స్వల్పగాయాలతో బయటపడ్డారని, గీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement