మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ నుంచి మదీనాకు వెళ్లిన 333 మంది హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ హజ్ డైరెక్టర్ మహ్మద్ ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18, 19 తేదీలలో మదీనాకు చేరుకున్న యాత్రికులకు నాలుగు రోజులైనా లగేజ్ అందకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రత్యేకంగా బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న యాత్రికుల మందులు లగేజ్‌లోనే ఉండిపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. కొంతమంది యాత్రికులు అదే ఎహెరామ్ దుస్తులతో పలుదినాలుగా కొనసాగాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం హజ్ యాత్రికుల లగేజ్‌ను ప్రత్యేక విమానాల ద్వారా సమయానికి పంపించే విధానం ఉన్నప్పటికీ, ఈసారి నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం జరిగిందని విమర్శించారు. ప్రస్తుతం లగేజ్ గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ వద్దే నిలిచిపోయిందని తెలిపారు. కేంద్ర హజ్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మదీనాలో ఉన్న యాత్రికులకు వైద్య సేవలు అందించడంతో పాటు వారి లగేజ్‌ను త్వరితగతిన చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ నేత,
మాజీ హజ్ డైరెక్టర్ మహ్మద్ ఇమ్రాన్


