కట్టెల పొయ్యిని వదిలి గ్యాస్ వైపు మళ్లిన గిరిజనానికి ఇప్పుడు గ్యాస్
గండం పట్టుకుంది. నెలకు రావాల్సిన కోటాలో సగం కూడా రాకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వంటలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఒకవైపు 60 రోజుల వెయిటింగ్.. మరోవైపు బ్లాక్
మార్కెట్‌లో మూడు వేల ధర.. జిల్లాలో గ్యాస్ సిలిండర్ సామాన్యుడికి గగనమైపోతోంది.
సాక్షి, పాడేరు: జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. సరఫరాలో అంతరాయం కలగడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని సాకు చూపుతూ కంపెనీలు సరఫరాను భారీగా తగ్గించడంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అంతటా ఇదే పరిస్థితి
జిల్లా కేంద్రమైన పాడేరులోని ఐటీడీఏ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీతో పాటు జిల్లాలోని మొత్తం 17 ఏజెన్సీల్లో కొరత అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల కుటుంబాలు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతినెల 78 వేల సిలిండర్లు సరఫరా కావాల్సి ఉండగా, గత రెండు నెలలుగా కంపెనీలు సరఫరాను సగానికి పైగా తగ్గించాయి. ఓటీపీ విధానాన్ని సాకుగా చూపి నెలకు 30 వేలకు మించి సిలిండర్లు పంపకపోవడంతో వినియోగదారులు అల్లాడిపోతున్నారు.
గ్యాస్ బండ కోసం తప్పని నిరీక్షణ
గ్యాస్ బుక్ చేసుకున్న తరువాత అది చేతికి అందడానికి 60 రోజులకు పైగా సమయం పడుతోంది. ఓటీపీలు సకాలంలో రాకపోవడం, ఏజెన్సీల వద్ద సరైన సమాచారం లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఫలితం లేక ఖాళీ సిలిండర్లను తిరిగి ఇళ్లకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాలనుంచి మండల కేంద్రాలకు సిలిండర్లు తీసుకురావడానికి రవాణా ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి.
కట్టెల పొయ్యే దిక్కు..
గడిచిన పదేళ్లలో సుమారు 80 శాతం గిరిజన కుటుంబాలు గ్యాస్ వినియోగానికి అలవాటు పడ్డాయి. ప్రస్తుతం గ్యాస్ అందకపోవడంతో మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు.
పట్టించుకోని అధికారులు
సాధారణ సరఫరా నిలిచిపోవడంతో ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు. గృహ అవసరాలకు వాడే సిలిండర్‌ను డిమాండ్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు అమ్ముతున్నారు. జిల్లా కేంద్రంలో అక్రమ విక్రయాలు బహిరంగంగా జరుగుతున్నా, పౌరసరఫరాల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేధిస్తున్న సిలిండర్ల కొరత
సగానికి తగ్గిన సరఫరా
బుక్ చేసిన తరువాత
60 రోజులు వేచి ఉండాల్సిందే
బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయాలు
రూ.2,500 నుంచి
రూ.3వేలకు అమ్మకం
అల్లాడుతున్న వినియోగదారులు


