సీలేరు: సీలేరు గ్రామ దేవత మారెమ్మ తల్లి 54వ జాతర మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా గత 10 రోజులుగా ఆలయంలో వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారి ఆలయంలో అర్చకులు దామోదర్ శర్మ ఆధ్వర్యంలో ముగ్గురు దంపతులతో కలిసి దేవి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు నాగ శకుంతల నేతృత్వంలో ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. శనివారం ఉత్సవ మూర్తిని సీలేరు పురవీధుల్లో వైభవంగా ఊరేగించనున్నారు. ఆదివారం జరగనున్న అమ్మవారి ప్రధాన జాతర కోసం ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో శుక్రవారం నుండే ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.
ప్రత్యేక బస్సులు
సీలేరు గ్రామ దేవత మారెమ్మ తల్లి ప్రధాన జాతర మహోత్సవాలు పురస్కరించుకుని, విశాఖపట్నం డిపో నుంచి సీలేరుకు రెండు రోజుల పాటు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు విశాఖ ఆర్టీసీ డీఎం మాధురి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం అమ్మవారి ఊరేగింపు, ఆదివారం ప్రధాన పండుగ జరగనున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి రవాణా ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, రాత్రి 11.30 గంటలకు సీలేరు చేరుకుంటుంది. తిరిగి ఆదివారం, సోమవారం ఉదయం 6:30 గంటలకు ఈ బస్సులు సీలేరు నుంచి విశాఖపట్నానికి బయలుదేరుతాయి. ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఆలయంలో హోమాలు, కుంకుమార్చనలు


