స్వయం గణనను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

స్వయం గణనను ప్రోత్సహించాలి

Apr 25 2026 7:36 AM | Updated on Apr 25 2026 7:36 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ నిషాంతి, సమావేశానికి హాజరైన అధికారులు

పాడేరు: జనగణనలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిర్దేశించిన పోర్టల్‌లో తప్పనిసరిగా స్వయం గణన చేసుకోవాలని కలెక్టర్‌ నిషాంతి ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. స్వయం గణన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ యుద్ధప్రాతిపదికన తమ స్వయం గణనతో పాటు, కుటుంబ సభ్యుల వివరాలను కూడా విధిగా నమోదు చేయాలన్నారు. స్వయం జనగణనను ప్రోత్సహించేందుకు వివిధ స్థాయిల్లో 15 రోజుల పాటు విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్వయం గణనపై ప్రజలు, ఉద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రమైన పాడేరులో 5కే వాక్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. పాడేరు పాత బస్టాండ్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం నుంచి సినిమా హాల్‌ సెంటర్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, తలారిసింగి జంక్షన్‌ మీదుగా ప్రభుత్వ వైద్య కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, మేధావులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ వాకథాన్‌లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధికారులు.. నోడల్‌ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారితో నిరంతరం సమన్వయం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ఇన్‌చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నీలకంఠేశ్వరరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంతి

Advertisement
 
Advertisement
Advertisement