కొయ్యూరు: ఉపాధి హామీ కూలీల మస్టర్ల నమోదులో ఎదురవుతున్న ముఖ గుర్తింపు సమస్యలను పరిష్కరించినట్లు చింతపల్లి క్లస్టర్ ఏపీడీ సీతయ్య తెలిపారు. శుక్రవారం కొయ్యూరు ఏపీవో కార్యాలయంలో వీఆర్‌పీలు, టీసీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కూలీల ఫొటోలను రోజుకు రెండుసార్లు తీయాలి. మొదటి ఫొటోకు, రెండో ఫోటోకు మధ్య కనీసం 4 గంటల వ్యవధి ఉండాలన్నారు. ఉదయం 6 గంటలకు తీసే ఫొటోలు వ్యక్తిగతంగా ఉండాలని, ఆ తర్వాత తీసేవి గ్రూపు పొటోలుగా ఉండాలని సూచించారు. సాంకేతిక సమస్యల పరిష్కారంపై అరకు క్లస్టర్ నిపుణులు పవన్ కుమార్ ద్వారా సిబ్బందికి ప్రత్యేక అవగాహన కల్పించారు. ఇకపై పొటోలు తీసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల కంటే సామాజిక ఆస్తుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ పనులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 46 వేల మంది కూలీలు పని చేస్తున్నారని, త్వరలోనే ఈ సంఖ్య లక్షకు చేరుతుందని తెలిపారు. కూలీల వేతనాలు కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు.ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో ఫొటోల అప్‌లోడ్ విషయంలో కొయ్యూరు వెనుకబడి ఉందని సీతయ్య అసహనం వ్యక్తం చేశారు. గుర్తించిన పనుల ఫొటోలను శనివారం మధ్యాహ్నం లోపు అప్‌లోడ్ చేయకుంటే, నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీవో అప్పలరాజు, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
చింతపల్లి క్లస్టర్ ఏపీడీ సీతయ్య


