భార్య గొంతు కోసి భర్త హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

భార్య గొంతు కోసి భర్త హత్యాయత్నం

Apr 25 2026 7:36 AM | Updated on Apr 25 2026 7:36 AM

చింతపల్లి: భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా, భర్త తన భార్య గొంతు కోసి హత్యాయత్నం చేసిన ఘటన చింతపల్లి మండలం వాంగెడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని వాంగెడ్డ గ్రామానికి చెందిన కొర్రా భాగ్యశ్రీకి, జి.మాడుగుల మండలం సింగర్బ పంచాయతీ ఊబలగరువు గ్రామానికి చెందిన పాంగి పాపినాయుడుతో 2024లో వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికే దంపతుల మధ్య మనస్పర్థలు మొదలై, తరచూ గొడవలు జరుగుతుండేవి. వీరి మధ్య గొడవలను గ్రామ పెద్దలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇద్దరికీ నచ్చజెప్పి భాగ్యశ్రీని భర్త వద్దకు పంపించారు. అయినప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, వారం క్రితం భాగ్యశ్రీ తన పుట్టింటికి (వాంగెడ్డ) వచ్చేసింది. రెండు రోజుల క్రితం భార్య వద్దకు వచ్చిన పాపినాయుడు, గురువారం తెల్లవారుజామున మళ్లీ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి భాగ్యశ్రీ గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దీంతో భర్త అక్కడి నుండి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన భాగ్యశ్రీని వెంటనే చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అందుకే కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ వీరబాబు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement