● గ్రామీణ నాయకత్వంలో మహిళలదే కీలక పాత్ర
● జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర
మహారాణిపేట(విశాఖ): స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా గ్రామీణ నాయకత్వంలో వారి పాత్ర గణనీయంగా పెరిగిందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె. సుభద్ర అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 33వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు బలమైన చట్టబద్ధత లభించిందని, 1993 నుంచి గ్రామీణ స్వపరిపాలన బలోపేతం అవుతోందన్నారు. గ్రామాలే దేశాభివృద్ధికి పునాది అని, నిర్ణయాధికారాల్లో మహిళల పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయని ఆమె ఉద్ఘాటించారు. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి మాట్లాడుతూ.. పంచాయతీలకు 29 అంశాలపై అధికారాలు కల్పిస్తూ అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, 16వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు మరిన్ని నిధులు అందనున్నాయని వివరించారు. ‘స్వర్ణ పంచాయత్’పోర్టల్ ద్వారా పన్నుల వసూళ్లను ఆన్‌లైన్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. డీపీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పంచాయతీరాజ్ ఒకటని, వికసిత భారత్ లక్ష్య సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్ మాట్లాడుతూ పారదర్శకతతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది ఉద్యోగులకు జెడ్పీ చైర్‌పర్సన్ ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు.


