విధి నిర్వహణలో పారదర్శకత అవసరం | - | Sakshi
Sakshi News home page

విధి నిర్వహణలో పారదర్శకత అవసరం

Apr 25 2026 7:30 AM | Updated on Apr 25 2026 7:30 AM

● గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టాలి ● విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి

అల్లిపురం(విశాఖ): నగర పోలీస్‌ అధికారులు, సిబ్బంది విధులను పారదర్శకంగా నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి సూచించారు. విధుల్లో చట్టవ్యతిరేక చర్యలు, అధికార దుర్వినియోగం లేదా అవినీతి చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన క్రైమ్‌ రివ్యూ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి స్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై నిఘా చర్యలను పరిశీలించారు. ఇటీవల నమోదు చేసిన ఎన్‌డీపీఎస్‌ కేసులను సమీక్షిస్తూ, నగరం గుండా గంజాయి రవాణా పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, ఆలస్యానికి కారణాలు తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కోర్టు తీర్పులు వచ్చిన కేసులపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రతి స్టేషన్‌ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, నిర్మానుష్య, సమస్యాత్మక ప్రాంతాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌, పికెటింగ్‌, అవసరమైతే డికాయ్‌ టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవ్‌ టీజింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, రాష్‌ డ్రైవింగ్‌ వంటి సమస్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన వాహనాలు, సిబ్బంది గురించి తెలియజేయాలని సూచించారు. పొక్సో కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. నగరంలో నేరాల రేటు తగ్గేందుకు రాత్రిపూట నిఘాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాలు పెంచాలని, ఆధునిక సాఫ్ట్‌వేర్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వేధింపులు లేదా మిస్సింగ్‌ కేసులలో ఆలస్యం లేకుండా స్పందించాలని సూచించారు. కోర్టుల్లో కేసులు ఆలస్యం కాకుండా చూసి, కన్విక్షన్‌ రేటు పెరగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్‌ అదాలత్‌లో మరిన్ని కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు వి.ఎన్‌.మణికంఠ చందోలు, డి.మేరీ ప్రశాంతి, డీసీపీ (క్రైమ్స్‌) లతా మాధురి, ఏడీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement