విశాఖ రైల్వేస్టేషన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టు ఊపందుకుంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల వైపు 60 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ప్రయాణికులకు విమానాశ్రయ స్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్టేషన్ ఉత్తర, దక్షిణ దిశలైన జ్ఞానాపురం వైపు, అలాగే ప్రధాన ప్రవేశ ద్వారం భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ప్రధాన కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లు ఉన్న భవనాల స్థానంలో బహుళ అంతస్తుల అత్యాధునిక నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కోటి 5 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో రెండు ప్రధాన భవనాలను నిర్మిస్తున్నారు. ప్రారంభంలో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ.. ప్రస్తుతం మాత్రం వేగంగా పుంజుకున్నాయి. అసలు ఎటువైపు ఏం అభివృద్ధి జరుగుతోందో ఓసారి పరిశీలిద్దాం..
రాజ ప్రాసాదంలా ముఖద్వారం
రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల్లో భాగంగా స్టేషన్ ముఖద్వారం సరికొత్త రూపు సంతరించుకోనుంది. దీనికి సంబంధించిన డిజైన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. నూతన నిర్మాణ పనులకు వీలుగా ప్రయాణికుల రిజర్వేషన్ కేంద్రాన్ని పాత ప్రదేశం నుంచి గేట్–3 వద్ద గల జనరల్ టికెట్ కౌంటర్ ప్రాంగణానికి మార్చారు. పోస్టల్ కార్యాలయం పక్కన ఉన్న పార్కింగ్ స్థలాన్ని ఖాళీ చేయించి, కొత్త రోడ్లు, గేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
జిగేల్‌మనేలా జ్ఞానాపురం
అభివృద్ధి పనులన్నీ ప్రస్తుతం జ్ఞానాపురం వైపు వేగంగా సాగుతున్నాయి. కీలకమైన భవనాల నిర్మాణం, కొత్త ప్లాట్‌ఫాంలు, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో ఈ ప్రాంతం కొత్త రూపు సంతరించుకోనుంది. ఇందుకోసం జ్ఞానాపురం వైపు ఉన్న ఖాళీ స్థలాలను చదును చేస్తూ, అంతర్గత రహదారులు, ఫుట్‌పాత్‌లను నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రధాన భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతుండగా.. ముఖ్యంగా జీ+3 అంతస్తులతో ఒక భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు.
విశాలంగా పార్కింగ్ సౌకర్యం
స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, దానికి అనుగుణంగా పార్కింగ్ సౌమర్థ్యాన్ని పెంచుతున్నారు. స్టేషన్ ప్రధాన ద్వారం వైపు 300 ద్విచక్ర వాహనాలు, 160 కార్లు నిలుపుదలకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జ్ఞానాపురం వైపు ప్రయాణికుల కోసం మరింత విశాలంగా 1,500 ద్విచక్ర వాహనాలు, 250 కార్ల సామర్థ్యంతో పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ముంపు సమస్యకు స్వస్తి
స్టేషన్ విస్తరణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న ఎర్రిగెడ్డ కాలువను సుమారు 13.5 మీటర్ల వెడల్పుతో అధికారులు విజయవంతంగా దారి మళ్లించారు. దీని వల్ల స్టేషన్‌లో పార్శిల్ కేంద్రం, ఇతర అవసరాల కోసం అదనపు స్థలం అందుబాటులోకి వచ్చింది. ఈ మార్పుతో స్టేషన్‌కు ముంపు సమస్య కూడా శాశ్వతంగా తొలగిపోయింది.
50 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళిక
రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఈ స్టేషన్‌ను కేవలం రైళ్లు వచ్చి వెళ్లే ప్రాంతంగానే కాకుండా, నగరానికే తలమానికంగా నిలిచే ఒక భారీ వాణిజ్య, రవాణా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల్లో రైల్వే కార్యాలయాలతో పాటు.. అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, విశ్రాంతి గదులు, విశాలమైన వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ పనులన్నీ పూర్తయితే, విశాఖపట్నం రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన రవాణా కేంద్రంగా అవతరించి, నగర కీర్తిని దశదిశలా చాటుతుంది.
– లలిత్ బోహ్రా, వాల్తేరు డీఆర్‌ఎం
చురుగ్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ విస్తరణ
ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్‌ఫాంలను 14కు పెంచేలా పనులు
టెర్మినల్స్ మాదిరిగా ఫ్లాట్‌ఫాంల నిర్మాణం
ఎర్రి గెడ్డ మురుగు కాలువ దారి మళ్లింపు.. 1.50లక్షల చదరపు అడుగుల పార్కింగ్
60కి పైగా లిఫ్ట్‌లు, 50 వరకు ఎస్కలేటర్ల ఏర్పాటు
75 వేల మంది సామర్థ్యంతో..
ప్రస్తుతం విశాఖ నుంచి నిత్యం 110 నుంచి 130 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, అందులో దాదాపు 40 రైళ్లు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య 50 నుంచి 75 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్లాట్‌ఫాంలను టెర్మినల్ తరహాలో 650 నుంచి 1000 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. దీని వల్ల 24 కోచ్‌లకు పైగా ఉన్న సుదీర్ఘ రైళ్లను కూడా సులభంగా నిలిపే వీలుంటుంది. ప్రస్తుతం రోజుకు 45 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, ఆధునికీకరణ పనులు పూర్తయితే ఆ సామర్థ్యం 75 వేల నుంచి 90 వేల వరకు పెరగనుంది.
6 కొత్త ప్లాట్‌ఫాంలతో..
ప్రస్తుతం రైల్వే స్టేషన్‌లో 8 ప్లాట్‌ఫాంలు ఉండగా, తొలుత మరో రెండింటిని మాత్రమే ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, పెరుగుతున్న రైళ్ల రద్దీతో పాటు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానున్న నేపథ్యంలో, అదనపు ప్లాట్‌ఫాంల ఆవశ్యకతను గుర్తించిన అధికారులు వీటి సంఖ్యను 14కు పెంచారు. ఈ ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వస్తే.. అవుటర్‌లో ప్లాట్‌ఫాం కోసం రైళ్లు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. అలాగే, బైపాస్ మీదుగా రైళ్లను దారి మళ్లించే ఇబ్బందులు కూడా తప్పుతాయి.
భారీ ఎయిర్ కాన్‌కోర్స్ ప్రత్యేక ఆకర్షణ
ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా భారీ ఎయిర్ కాన్‌కోర్స్ నిలవనుంది. 72 మీటర్ల వెడల్పు, 220 మీటర్ల పొడవుతో దీనిని నిర్మిస్తున్నారు. స్టేషన్ ప్లాట్‌ఫాంల పైభాగంలో, సహజ సిద్ధమైన కాంతి ప్రసరించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇది స్టేషన్‌కు రెండు వైపులా ఉన్న ప్లాట్‌ఫాంలను అనుసంధానిస్తుంది. ఇక్కడ 600 మంది ప్రయాణికులు కూర్చునే వీలుండటంతో పాటు 20 వాణిజ్య దుకాణాలు కూడా రాబోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 60 లిఫ్ట్‌లు, 50 ఎస్కలేటర్లు, 28 ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.


