మాకవరపాలెం: పయనీర్ పరిశ్రమ కార్మికులతో యాజమాన్య ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో వరుసగా మూడో రోజు కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆందోళన కొనసాగించారు. మండలంలోని రాచపల్లి వద్ద పయనీర్ పరిశ్రమలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు పలు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాచపల్లి, జి.కోడూరు, రామన్నపాలెం గ్రామాలకు చెందిన నాయకులు ముందుగా కార్మికులకు ఆందోళన విరమించాలని సర్ది చేప్పే ప్రయత్నం చేశారు. అయినా వారంతా ఏ మాత్రం తగ్గకుండా యాజమాన్య ప్రతినిధులు వచ్చి తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు. కంపెనీకి భూ సేకరణ సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, ఇతర ప్రాంతాల వారికి యాజమాన్యం ఉద్యోగాలు ఇస్తోందన్నారు. తమకు మద్దతుగా నిలవకుండా కంపెనీకి అనుకూలంగా మాట్లాడటం ఏంటని ఒక దశలో నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పయినీర్ యాజమాన్య ప్రతినిధులైన ఎల్.ఎస్.రావు, తదితరులు కార్మికుల వద్దకు చేరుకుని మాట్లాడారు. ఆందోళన విరమించి పనుల్లో చేరాలన్నారు. డిమాండ్లను ఇప్పటికిప్పుడు పరిష్కరించే అవకాశం లేదన్నారు. ఇవన్నీ కంపెనీ పెద్దలకు తెలియజేస్తామన్నారు. ఈ నేపథ్యంలో చర్చలు ఫలించ లేదు.
మూడో రోజు ఆందోళనకు సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు శంకర్రావు, రాజు, డివిజన్ నాయకుడు చిరంజీవి మద్దతుగా పాల్గొన్నారు. పరిశ్రమ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్‌ఐ దామోదర్‌నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.


