బుచ్చెయ్యపేట: మండలంలోని దిబ్బిడి గ్రామంలో గురువారం సాయంత్రం సరుగుడు తోట కాలిపోయింది. సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక్కడ జగ్గరాజు చెరువు దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో గాలికి అగ్గి రవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న గంప పైడిరాజుకు చెందిన సరుగుడు తోటలో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అరెకర పొలంలో సరుగుడు తోట మొత్తం కాలిపోయింది. మూడున్నరేళ్ల క్రితం వేసిన పంట చేతికంది వచ్చే సమయంలో కాలిపోవడంతో బాధిత రైతు లబోదిబోమన్నాడు. నిరుపేదనైన తనకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.


