సాక్షి,పాడేరు: జిల్లాలోని నీటి సంరక్షణ లక్ష్యంగా చేపడుతున్న జలధార జలహారతి వంద రోజుల ప్రణాళిక పనులపై కలెక్టర్ టి.నిశాంతి సమీక్షించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 326 గ్రామాల్లో భూగర్భ జలాల సంరక్షణ కట్టడాల కోసం స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి సమస్యలు లేకుండా ఉండాలంటే వందరోజుల ప్రణాళిక పనులను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డ్వామా పీడీ విద్యాసాగర్, భూగర్భ జలవనరులశాఖ అధికారి శ్రీనివాసరావు, డీఎఫ్‌వో ఉమామహేశ్వరి పాల్గొన్నారు.


