గ్రహణం | - | Sakshi
Sakshi News home page

గ్రహణం

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

కూటమి ప్రభుత్వంలో గిరిజనాభివృద్ధి గాలికి వదిలేశారు. సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఏడాది కాలంగా నిర్వహించకపోవడంపై ఏజెన్సీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన సమావేశం, గతేడాది ఏప్రిల్‌ నుంచి మోక్షానికి నోచుకోలేదు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు నిలదీస్తారనే భయంతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఫలితంగా మన్యం అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గిరిజనాభివృద్ధికి

సాక్షి, పాడేరు: గిరిజనాభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికార కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. గిరిజనుల సమస్యలపై చర్చించాల్సిన అత్యంత కీలకమైన పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన ఈ సమావేశం, ఏడాది కాలంగా జరగకపోవడం గమనార్హం.

● గత ఏడాది ఏప్రిల్‌ 21వ తేదీన 74వ ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కేవలం మొక్కుబడిగా సాగిందనే విమర్శలు ఉన్నాయి. అప్పట్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, సీపీఎంకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్సీలు, ఇతర ప్రతినిధులు గిరిజన సమస్యలపై ఏకరువు పెట్టారు. ముఖ్యంగా గిరిజనులకు నూరు శాతం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన జీవో నంబరు 3 పునరుద్ధరణపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని నిలదీశారు. ఆ సమయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఆమె ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సరిగ్గా అదే సమయంలో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావుకు ఛాతీనొప్పి రావడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. ఆ తర్వాత ఏడాది గడుస్తున్నా మళ్లీ సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు.

ప్రతిపక్షాల బలమే కారణమా?

ఐటీడీఏ పాలకవర్గంలో మెజారిజీ ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలకు చెందిన వారు కావడమే ఈ జాప్యానికి కారణమని ప్రచారం జరుగుతోంది. అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మ తనూజరాణి, విశాఖ జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరావు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో పాటు తొమ్మిది మంది ఎంపీపీలు, తొమ్మిది మంది జెడ్పీటీసీలు వైఎస్సార్‌సీపీకి చెందినవారు. అనంతగిరి జడ్పీటీసీ సీపీఎం ప్రతినిధిగా ఉన్నారు. సమావేశం నిర్వహిస్తే వీరంతా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారనే భయంతోనే కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని చర్చ జరుగుతోంది.

గిరిజన సంక్షేమం గాలికే..

పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజనాభివృద్ధి కుంటుపడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీవో నంబరు 3 వివాదం..

జీవో నంబరు 3 పునరుద్ధరణపై స్పష్టత లేకపోవడంతో గిరిజన అభ్యర్థులు డీఎస్సీలో ఉద్యోగాలు కోల్పోయారు. మళ్లీ కొత్త నోటిఫికేషన్లు వస్తున్న తరుణంలో ఐటీడీఏ తీర్మానం అవసరమున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మౌలిక వసతులు: మారుమూల గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ అభివృద్ధి శూన్యమని విమర్శలు వస్తున్నాయి.

పరిష్కారం చూపని పీజీఆర్‌ఎస్‌

ప్రతి శుక్రవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో గిరిజనులు విన్నవిస్తున్న వ్యక్తిగత, గ్రామ సమస్యలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏడాది కాలంలో నాలుగుసార్లు నిర్వహించాల్సిన సమావేశాన్ని ఒక్కసారి కూడా నిర్వహించకపోవడంపై గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఏడాదిగా నోచుకోనిఐటీడీఏ పాలకవర్గ సమావేశం

గతేడాది ఏప్రిల్‌ 21 తర్వాత మళ్లీ నిర్వహించని వైనం

కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష భయం

మెజారిటీ ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీ వారు కావడమే జాప్యానికి కారణం

జీవో నంబరు 3, రోడ్లు, తాగునీటి

సమస్యలపై నిలదీస్తారనే సర్కారు వెనకడుగు

తక్షణమే సమీక్ష నిర్వహించాలని

గిరిజన సంఘాల డిమాండ్‌

వెంటనే నిర్వహించాలి

ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఏడాదిగా నిర్వహించకపోవడం దారుణం. గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలతో గిరిజనులు సతమతమవుతున్నారు. గిరిజన సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. గిరిజనులకు న్యాయం చేయాలంటే పాడేరు పాలకవర్గ సమావేశాన్ని వెంటనే నిర్వహించాల్సిందే.

– రేగం మత్స్యలింగం,

ఎమ్మెల్యే, అరకులోయ

సమస్యలపై నిర్లక్ష్యం తగదు

ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల ద్వారా గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయి. గ్రామస్థాయిలో గిరిజనులు ఎదుర్కొనే అన్ని సమస్యలను సభ్యులంతా పాలకవర్గ సమావేశం దృష్టికి తీసుకువస్తారు. ఏడాది నుంచి పాలకవర్గ సమావేశం పెట్టకపోవడంతో గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. గిరిజన సమస్యలపై కూటమి ప్రభుత్వం, గిరిజన మంత్రికి నిర్లక్ష్యం తగదు. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు,

ఎమ్మెల్యే, పాడేరు

Advertisement
 
Advertisement
Advertisement