సాక్షి, పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత నెలకొంది. చాలా చోట్ల నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ కొన్ని చోట్ల అరకొరగా లభిస్తున్నప్పటికీ, డీజిల్ కొరత మాత్రం తీవ్రంగా ఉంది.
● జిల్లా కేంద్రంలోని తలారిసింగి ఐవోసీ, సుండ్రుపుట్టులోని బీపీ కంపెనీ బంకులు గురువారం మూతబడ్డాయి. నిల్వలు లేకపోవడంతో యాజమాన్యాలు బోర్డులు పెట్టడంతో వాహనదారులు నిరాశతో వెనుదిరిగారు. అందుబాటులో ఉన్న మరికొన్ని బంకుల్లో కూడా నిల్వలు తక్కువగా ఉండటంతో, అందరికీ సర్దుబాటు చేసేలా పరిమితంగానే ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు.
అభివృద్ధి పనులపై ప్రభావం
డీజిల్ కొరత ప్రభావం మన్యంలోని అభివృద్ధి పనులపై తీవ్రంగా పడింది. పాడేరు ప్రాంతంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులతో పాటు ఏజెన్సీ అంతటా రోడ్లు, వంతెనల నిర్మాణాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. లారీలు, యంత్రాల నిర్వహణకు ప్రతిరోజూ సుమారు 50 వేల లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. ఒక్క జాతీయ రహదారి నిర్మాణ పనులకే కాంట్రాక్టర్లు రోజుకు 23 వేల లీటర్ల వరకు డీజిల్ వినియోగిస్తున్నారు. ఇంధనం లేకపోవడంతో యంత్రాలన్నీ మూలకు పడ్డాయి.
సరఫరాలో జాప్యం:
బంకుల యాజమాన్యాలు ఆయిల్ కంపెనీలకు ముందస్తుగానే ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరుపుతున్నప్పటికీ, కంపెనీలు సకాలంలో ఆయిల్ ట్యాంకర్లను పంపడం లేదని తెలుస్తోంది. ఈ సరఫరా లోపం కారణంగానే ఏజెన్సీలో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పెట్రోల్ బంక్‌ల వద్ద నోస్టాక్ బోర్డులు


