హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ సర్వేలపై గిరిజనుల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ సర్వేలపై గిరిజనుల ఆగ్రహం

Apr 24 2026 6:08 AM | Updated on Apr 24 2026 6:08 AM

సాక్షి, పాడేరు: హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ ప్రాంతాల్లో అధికారులు రహస్యంగా శాటిలైట్‌ సర్వేలు చేపట్టడం అన్యాయమని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ చిట్టంవలస పరిధిలోని హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ వ్యతిరేక కమిటీ ప్రతినిధులు, గిరిజన సంఘం నేతలు గురువారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.

రహస్య సర్వేపై అభ్యంతరం

ఈ నెల 17వ తేదీన సర్వే ఆఫ్‌ ఇండియా, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ అధికారులు ఆనంద్‌ సాహు, వరదబోయిన గోపాలరావు బృందం రహస్యంగా సర్వే చేయడంపై నిరసనకారులు మండిపడ్డారు.

హక్కుల ఉల్లంఘన

గిరిజన సంఘం రాష్ట్ర నేత పి. అప్పలనర్స మాట్లాడుతూ.. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు, హక్కులను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం 8,200 మెగావాట్ల హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. గ్రామసభల ఆమోదం లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకూడదన్నారు. అధికారులు ఎవరూ అనుమతి లేకుండా గ్రామాల్లోకి రావొద్దని సూచించారు. సర్వే పనులను తక్షణమే నిలిపివేయాలి, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

కలెక్టర్‌కు వినతి

అనంతరం గిరిజనులంతా కలెక్టర్‌ నిశాంతిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. గతంలో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఇచ్చిన హామీలను (ఎలాంటి సర్వేలు జరపబోమని) ఆమెకు వివరించారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయం మేరకు గ్రామసభలను సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. అయితే, శాటిలైట్‌ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకోవడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బూర్జ ఎంపీటీసీ హరి, పోరాట కమిటీ నాయకులు సివేరి కొండలరావు, దశరథ్‌, సురేష్‌, కృష్ణంరాజు, చిట్టిబాబు, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement