రోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఎటుచూసినా తేలిన కంకర రాళ్లు.. వాహనం వెళ్తే చాలు ఊపిరాడకుండా కమ్మేస్తున్న దుమ్ము మేఘాలు. గమ్యం చేరుకోవడానికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, కళ్లల్లో దుమ్ము నింపుకుని నరకప్రాయమైన ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారుల నిర్లక్ష్యమో, కాంట్రాక్టర్ల జాప్యమో తెలియదు కానీ, సామాన్యుడికి మాత్రం ఈ రహదారి శాపంగా మారింది.
కంకరతో కష్టాలు..
సీలేరు: దాదాపు మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని అంతర్రాష్ట్ర రహదారి దారాలమ్మ తల్లి ఘాట్ రోడ్డు ప్రయాణం ప్రస్తుతం నిత్య నరకంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా, జిల్లా కలెక్టర్లు మారుతున్నా ఈ రహదారి తలరాత మాత్రం మారడం లేదు. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూ, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 70 కిలోమీటర్ల మేర సాగాల్సిన ఈ రహదారి నిర్మాణానికి కాంట్రాక్టర్లు, అధికారులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుపై కేవలం కంకర వేసి వదిలేయడంతో, వాహనాలు వెళ్లేటప్పుడు భారీగా దుమ్ము రేగుతోంది. ఈ కంకరలో కార్లు, ఇతర వాహనాలు కూరుకుపోతుండటంతో, వాటిని బయటకు తీసేందుకు ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
కీలక దారి అయినా..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ ఘాట్ రోడ్డు ఆంధ్రప్రదేశ్‌ను ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో కలిపే ప్రధాన మార్గం. అంతర్రాష్ట్ర సరిహద్దులను కలిపే ఈ రహదారిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ మార్గంలో పనులు అసంపూర్తిగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన
రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఈ కీలక రహదారిని పట్టించుకోవడం లేదు. ఎస్‌డీఎంఎఫ్ నిధుల ద్వారా 2024 నవంబర్‌లో ఆర్‌వీ నగర్ నుంచి పాలగడ్డ వరకు మూడు భాగాలుగా పనులు మంజూరయ్యాయి. ఇవి ప్రారంభమై రెండున్నర ఏళ్లు గడుస్తున్నా, సుమారు 60 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయడంలో ఆర్‌అండ్‌బీ అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి.
● అర్‌వీనగర్ నుంచి లంకపాకల వరకు, సప్పర్ల నుంచి దారాలమ్మ తల్లి గుడి వరకు పనులు నత్తనడకన సాగుతున్నాయి. పత్రికల్లో కథనాలు వస్తున్నా, కలెక్టర్లకు విన్నవించినా అధికారుల తీరులో మార్పు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు.
అధ్వానంగా పాలగడ్డ రహదారి
సీలేరు నుంచి పాలగడ్డ వరకు ఉన్న సుమారు 20 కిలోమీటర్ల రహదారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ గుంతల వల్ల వర్షం పడితే ఈ రోడ్డు చెరువును తలపిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ నుంచి పర్యాటక కేంద్రాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల వాహనాలు ఇక్కడ పాడైపోతున్నాయి.
వర్షాకాలంతో ఇబ్బందే..
మరో రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. అప్పటికల్లా తారు రోడ్డు వేయకపోతే, ప్రస్తుతం వేసిన కంకర కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. తక్షణమే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పనులు జరిగేలా తక్షణ చర్యలు
గూడెం కొత్తవీధి మండలం రెండు రీచ్‌లలో తారు రోడ్డు పనులు తక్షణమే జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇందుకు అవసరమైన సామగ్రి ప్రస్తుతం దొరక్క పోవడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. గురువారం పాడేరులో జరిగే సమావేశంలో సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ఈఈ,
రోడ్లు భవనాలశాఖ, పాడేరు
అభివృద్ధికి నోచుకోని
అంతర్రాష్ట్ర రహదారి
ఏపీ, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌కు ప్రధాన మార్గం
ప్రాణాలు చేతపట్టుకుని ప్రయాణం
స్పందించని అధికార యంత్రాంగం


