సీలేరు: ముప్పై ఏళ్లుగా ఆ ఇల్లే అతనికి ఆశ్రయం.. అవే గోడల మధ్య తన జీవితాన్ని వెళ్లదీశాడు. కానీ, అదే ఇల్లు అతని ప్రాణాలను బలితీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఎస్‌ఐ యాసీన్ తెలిపిన వివరాల ప్రకారం.. దుప్పులవాడ ఊరి చివర వంతల చెన్నయ్య (65) అనే గిరిజనుడు ఒంటరిగా నివసిస్తున్నాడు. పదేళ్ల క్రితం భార్య మరణించడంతో, అప్పటి నుంచి ఎవరూ లేక ఒంటరిగానే ఉంటున్నాడు. గ్రామస్తులు ఇచ్చే సరకులతో వండుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి భారీ గాలివానకు, చెన్నయ్య నిద్రిస్తున్న పాత ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం గ్రామస్తులు వెళ్లి చూడగా, ఇల్లు కూలిపోయి ఉండటం గమనించారు. వెంటనే ధైర్యం చేసి పెంకులను, శిథిలాలను తొలగించగా.. చెన్నయ్య నిర్జీవంగా పడి ఉండటం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడికి బంధువులు ఎవరూ లేకపోవడంతో, గ్రామ వీఆర్వో ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అంత్యక్రియల కోసం మృతదేహాన్ని గ్రామస్తులకు అప్పగించారు.


